పాక్ నటులపై నిషేధం సబబే
సమర్థించిన శాండల్‌వుడ్ నటులు
బెంగళూరు : ఉరీలో భారత సైనిక శిబిరంపై పాక్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ నటులను బాలీవుడ్ సినిమాల్లో నిషేధించడంతో మిశ్రమ స్పందన లభిస్తోంది. కాగా ఈ విషయంపై శాండల్‌వుడ్ నటీనటులు కూడా పాక్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు. కళ కంటే దేశం గొప్పది... మొదట మనమందరం భారతీయులం ఆ తరువాతనే కళాకారులం పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదేనని కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తెలిపారు.
డెరైక్టర్ పవన్ ఒడెయార్ మాట్లాడుతూ... దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులను ప్రతి ఒక్కరు మద్దుతుగా నిలబడాలని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాక్ నటులపై నిషేధం సబబేనని అన్నారు. దేశం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పాక్ నటులపై నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు తెలపడమే మన కర్తవ్యమని ప్రముఖ హీరోయిన్ సంజన తెలిపారు. అదేవిధంగా మరో హీరో చేతన్, నిర్మాత ఎం.ఎస్.రమేశ్ తదితరులు పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు.