టీబీజీకేఎస్‌కు తప్పని ఇంటిపోరు
టీబీజీకేఎస్‌కు తప్పని ఇంటిపోరు
Published Mon, Sep 19 2016 12:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
గంపెడాశలతో కార్యకర్తలు
కొత్త చేరికలతోనే ఇబ్బందులు
మంచిర్యాల సిటీ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. యూనియన్‌లో నెలకొన్న నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి టీఆర్‌ఎస్ అధిష్టానం టీబీజీకేఎస్‌కు నూతన కమిటీని ప్రకటించి కేవలం నలుగురికి మాత్రమే బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల తర్వాత మిగతా పదవులు భర్తీ చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో ఆవిర్భావం నుంచి పార్టీని, సంఘాన్ని నమ్ముకొని ఉద్యమంలో భాగస్వాములై, జెండా మోసి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో మరోసారి సింగరేణిలో జెండా ఎగురవేస్తుందనే నమ్మకంతో టీబీజీకేఎస్‌లో చేరినవారూ ఉన్నారు. ఇంకా చేరికలు జరుగుతూనే ఉన్నారు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందన్న’ చందంగా వీరందరు ఆశించిన మేరకు పదవులు సర్దుబాటు చేయడం అధిష్టానానికి కత్తిమీద సాములాంటిదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆశలు పెట్టుకున్న వారిలో ఏదో మంచి హోదా ఉన్న పదవి రాకపోతుందా అని ఎదురు చూసేవారు ఎక్కువగానే కనబడుతున్నారు. ఇంతమందిలో పదవి రాకుంటే భవిష్యత్ ఏమిటా అని సందిగ్ధంలో మరి కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సంఘంలో ఉండాలా లేక బలమైన ప్రతిపక్ష సంఘంలోకి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనతో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మూడు వర్గాలకు ముడిపడేనా..?
టీబీజీకేఎస్‌లో ప్రస్తుతం మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, బి.వెంకట్రావు అనుచరులు ఉన్నారు. వీరిని నమ్ముకొని పదువులపై ఆశలు పెట్టుకున్నవారు ప్రతి ఏరియాలో పదుల సంఖ్యలో ఉన్నారు. గోదావరిఖని, శ్రీరాంపూర్ వంటి ఏరియాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువ. వారిని సంతృప్తి పరచడం సాధ్యమయ్యే పనికాదని యూనియన్‌లోని వారే చెబుతున్నారు. నాయకులను నమ్ముకున్న వారికి సరైన పదువులు రాని పక్షంలో గ్రూపుల సమస్య మరింత పెరిగే ఆవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎన్నికలకు ముందే పదవుల కేటాయింపు జరిగితే అసంతృప్తులను బుజ్జగించడం సాధ్యం కాదు. కార్మికుల్లో పట్టుఉన్న వారికి పదవులు ఇవ్వకుండా, గ్రూపుల ఆధారంగా ఇచ్చిన నేపథ్యంలో సంఘానికి ఎదురుదెబ్బ తగలక తప్పదు. అలాగే యూనియన్ గెలిచిన తర్వాతనే పదవులు ఇస్తామని చెబితే ఎన్నికల ప్రచారంలో ఏ హోదాతో కార్మికుల వద్దకు వెళ్లాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఏ హోదా లేకుండా తాము వెళితే ప్రతిపక్ష సంఘాల నాయకులు హోదాతో వస్తారు. అప్పుడు తమ మాటకు కార్మికులు విలువ ఇస్తారా’ అంటూ పలువురు ఈ పాటికే అగ్రనాయకులను ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సంఘం గెలిచిన తర్వాత పదవులు ఇవ్వాలనుకుంటే కోల్‌బెల్ట్‌లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసులకే ఆ ముగ్గురు అగ్రనాయకులు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే సందేహాలు ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతున్నా యి. భవిష్యత్‌లో పదవి లేకుండా గనులపై అధికారులతో ఏ హోదాలో మాట్లాడటానికి వెళ్లాలి.. ప్రతిపక్ష సంఘాల వద్ద సైతం చులకనయ్యే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు. ఎన్నికలు ఆలస్యమైతే ఇంటిపోరు మరింత పెరిగే అవకాశాలు సైతం కనబడుతున్నాయి.
సమసిపోని కుమ్ములాటలు
టీబీజీకేఎస్‌లో ఇంకా కుమ్ములాటలు సమసిపోలేదు. ఇందుకు నిదర్శనం ఈనెల 11న శ్రీరాంపూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం. ఇందులో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడటానికి సన్నద్ధమవుతుండగా కొందరు మాట్లాడవద్దంటూ అడ్డుతగిలారు. ఎంపీ బాల్క సుమన్ జోక్యం చేసుకొని సర్దిచెప్పినా వినిపించుకోలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో తాను యూనియన్ సమావేశానికి రాను అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు శాంతించక తప్పలేదు. రాజిరెడ్డి ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారు యూనియన్‌లోని మరో వర్గానికి చెందినవారనే విషయం స్పష్టమవుతూనే ఉంది. దీనిని బట్టి నేటికీ యూనియన్‌లో లుకలుకలు ఉన్నాయనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల పాటు కార్మికుల బాగోగులు పట్టించుకోకుండా గొడవలతో కాలం గడిపిన నాయకు ల కుమ్ములాటలు ఇంకా కొనసాగడంపై సంఘాన్ని నమ్ముకున్నవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement