చిన్న పార్టీలకు సీట్ల కేటాయింపుల్లో డీఎంకే నిమగ్నమైంది. మంగళవారం పెరుంతలైవర్ మక్కల్ కట్చి, వ్యవసాయ కార్మిక పార్టీకి తలా ఓ సీటును కేటాయించారు. పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామని డీఎంకే దళపతి స్టాలిన్ పేర్కొన్నారు.
సాక్షి, చెన్నై: డీఎంకేలో సీట్ల పంపకాల పర్వం వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చిలకు తలా ఐదు సీట్లు చొప్పున పది ఖరారు చేశారు. డీఎంకేకు మరికొన్ని చిన్న పార్టీలు, ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరితో చర్చించి సీట్ల కేటాయింపుల్లో స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ నిమగ్నం అయింది. మంగళవారం పెరుంతలై వర్ మక్కల్ కట్చి నేత ఎన్ ఆర్‌ధనపాలన్‌తో చర్చించారు. ఐదు సీట్లను వారు ఆశించగా, ఒక్క సీటుకు స్టాలిన్ పరిమితం చేశారు.
పెరంబూరు నియోజకవర్గానికి వారికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి బుజ్జగించడం తో ఎన్‌ఆర్ ధనపాలన్ ఒక్క సీటుకు అం గీకరించారు. అయితే, డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై పోటీ చేయనున్నా రు. వ్యవసాయ కార్మిక పార్టీ నేత పొన్ కుమార్ నేతృత్వంలోని బృందం స్టాలిన్ కమిటీతో భేటీ అయింది. వారికి కూడా ఒక్క సీటును కేటాయించారు. ఈ రెండు పార్టీల నేతలు గోపాలపురం చేరుకుని డీఎంకే చిహ్నం బరిలో పోటీకి తగ్గ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. మరికొన్ని చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటులో స్టాలిన్ నిమగ్నం అవుతూ, పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామన్నారు.
ఇక, ఐదు సీట్లను ఆశించిన ఎస్‌డీపీఐకు డీఎంకే మళ్లీ అవకాశం ఇచ్చేనా, అత్యధిక స్థానాల్ని ఆశిస్తున్న కాంగ్రెస్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించేనా అన్న ప్రశ్న బయల్దేరింది. కాంగ్రెస్ తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వారు ఆశించే సీట్లు, స్థానాల్ని ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. తాము ఇచ్చే స్థానాలతో సర్దుకోవడం, సూచించే సీట్లలో అభ్యర్థుల్ని బరిలోకి దించుకోవాల్సిన వంతు కాంగ్రెస్‌కు తప్పదంటున్నారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం కరుణానిధిని డీఎంకే బహిష్కృత నేత అళగిరి కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దక్షిణాది జిల్లాల్లో అత్యధికంగా కొత్త వాళ్లకు, యువకులు, మహిళలకు సీట్లు ఇవ్వాలని కరుణానిధికి అళగిరి సూచించి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు చర్చ సాగుతుండడం గమనార్హం.
చిన్న పార్టీలకు సీట్లు
Published Wed, Mar 30 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM
Advertisement