SDPI
-
మైసూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం
సాక్షి, బెంగళూరు: మైసూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. మాజీ మంత్రి, మైసూరు నగరంలోని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ శేఠ్ని ఆదివారం అర్ధరాత్రి ఫర్హాన్పాషా అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. మైసూరులోని పంజినా మైదానంలో బంధువుల నిశ్చితార్థానికి ఎమ్మెల్యే హాజరైన సమయంలో గౌసియానగరకు చెందిన ఫర్హాన్పాషా ఆయన మెడపై కత్తితో దాడి చేశాడు. ఎమ్మెల్యే మెడ నుంచి ధారగా రక్తం కారింది. భద్రతా సిబ్బంది దుండగుడిని అడ్డుకున్నారు. గాయపడిన ఎమ్మెల్యేని సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఉద్యోగం ఇప్పించలేదనే దాడి.. ఎమ్మెల్యేపై దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే తనకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడంతో దాడి చేసినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఫర్హాన్పాషా ఎస్డీపీఐ అనే పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఎమ్మెల్యేపై దాడి నేపథ్యంలో నగరంలో పోలీసులు బందోబస్తు పెంచారు. అల్లర్లు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను పలువురు నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
వెరైటీ ప్రచారం : పేరు ఆమెది.. ఫోటో అతనిది
బెంగళూరు : మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే నాయకులు మహిళలు రాజకీయాల్లోకి వస్తామంటే మాత్రం పెద్దగా సంతోషించరు. దేశ జనభాలో సగం ఉన్న మహిళలు.. రాజకీయాల్లో మాత్రం కనీసం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని మహిళా రాజకీయ ప్రతినిధులు ఎందరంటే వేళ్ల మీద లెక్కించి చెప్పగల్గే పరిస్థితి. ఒకవేళ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా పెత్తనం చెలాయించేది మాత్రం వారి కుటుంబంలోని పురుషులు. కేవలం పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడవారు మాత్రమే తమ రాజకీయ హోదాని సరిగ్గా వినియోగించుకోగల్గుతున్నారు. ఇది మన దేశమంతటా సర్వసాధణంగా కనిపించే దృశ్యం. కానీ కర్ణాటకలోని ఓ రాజకీయ పార్టీ మాత్రం ఏకంగా ప్రచారం నుంచే మహిళా అభ్యర్థులు స్థానంలో వారి కుటుంబాల్లోని మగవారి ఫోటోలను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంఘటన మంగళూరు ఉల్లాల్లో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’(ఎస్డీపీఐ) తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వివారాలతో కూడిన పాంప్లేట్ రూపొందించింది. అయితే ఆ పాంప్లేట్లలో మహిళలకు కేటాయించిన వార్డుల్లో వారి పేర్ల పక్కన ఖాళీ ఫోటో వచ్చే చోట ఖాళీగా వదిలి, ఆ పక్కనే సదరు మహిళా అభ్యర్థుల కుటుంబాలకు చెందిన మగవారి ఫోటోలను ముద్రించారు. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎస్డీపీఐ పార్టీ ‘మహిళా సాధికారత’ తన సిద్ధాంతంగా ప్రచారం చేసుకోంటోంది. అటువంటి పార్టీ మహిళా అభ్యర్థుల స్థానంలో వారి ఫోటోలను ప్రచురించకపోగా.. వారి కుటుంబానికి చెందిన మగవారి ఫోటోలను ముద్రించి విమర్శల పాలవుతోంది. ట్విటర్లో పోస్టు చేసిన ఈ పాంప్లేట్కు నెటిజన్లు వారిదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేనా మీరు ప్రచారం చేసిన మహిళా సాధికారత’, ‘మహిళా సాధికారతకు అసలు సిసలు నిదర్శనం ఇదే’ అంటూ కామెంట్ చేస్తోన్నారు. ఈ విషయం గురించి ఎస్డీపీఐ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఫోటోలు ముద్రించాలనే నిబంధనేం లేదు. ఓటర్లకు వారి అభ్యర్థుల గురించి తెలుసన్నారు. సమయానికి మహిళా అభ్యర్థుల ఫోటోలు లభించకపోవడంతో.. వారి కుటుంబానికి చెందిన పురుషుల ఫోటోలు ముద్రించాం అని తెలిపారు. -
చిన్న పార్టీలకు సీట్లు
చిన్న పార్టీలకు సీట్ల కేటాయింపుల్లో డీఎంకే నిమగ్నమైంది. మంగళవారం పెరుంతలైవర్ మక్కల్ కట్చి, వ్యవసాయ కార్మిక పార్టీకి తలా ఓ సీటును కేటాయించారు. పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామని డీఎంకే దళపతి స్టాలిన్ పేర్కొన్నారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో సీట్ల పంపకాల పర్వం వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చిలకు తలా ఐదు సీట్లు చొప్పున పది ఖరారు చేశారు. డీఎంకేకు మరికొన్ని చిన్న పార్టీలు, ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరితో చర్చించి సీట్ల కేటాయింపుల్లో స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ నిమగ్నం అయింది. మంగళవారం పెరుంతలై వర్ మక్కల్ కట్చి నేత ఎన్ ఆర్ధనపాలన్తో చర్చించారు. ఐదు సీట్లను వారు ఆశించగా, ఒక్క సీటుకు స్టాలిన్ పరిమితం చేశారు. పెరంబూరు నియోజకవర్గానికి వారికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి బుజ్జగించడం తో ఎన్ఆర్ ధనపాలన్ ఒక్క సీటుకు అం గీకరించారు. అయితే, డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై పోటీ చేయనున్నా రు. వ్యవసాయ కార్మిక పార్టీ నేత పొన్ కుమార్ నేతృత్వంలోని బృందం స్టాలిన్ కమిటీతో భేటీ అయింది. వారికి కూడా ఒక్క సీటును కేటాయించారు. ఈ రెండు పార్టీల నేతలు గోపాలపురం చేరుకుని డీఎంకే చిహ్నం బరిలో పోటీకి తగ్గ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. మరికొన్ని చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటులో స్టాలిన్ నిమగ్నం అవుతూ, పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామన్నారు. ఇక, ఐదు సీట్లను ఆశించిన ఎస్డీపీఐకు డీఎంకే మళ్లీ అవకాశం ఇచ్చేనా, అత్యధిక స్థానాల్ని ఆశిస్తున్న కాంగ్రెస్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించేనా అన్న ప్రశ్న బయల్దేరింది. కాంగ్రెస్ తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వారు ఆశించే సీట్లు, స్థానాల్ని ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. తాము ఇచ్చే స్థానాలతో సర్దుకోవడం, సూచించే సీట్లలో అభ్యర్థుల్ని బరిలోకి దించుకోవాల్సిన వంతు కాంగ్రెస్కు తప్పదంటున్నారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం కరుణానిధిని డీఎంకే బహిష్కృత నేత అళగిరి కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దక్షిణాది జిల్లాల్లో అత్యధికంగా కొత్త వాళ్లకు, యువకులు, మహిళలకు సీట్లు ఇవ్వాలని కరుణానిధికి అళగిరి సూచించి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు చర్చ సాగుతుండడం గమనార్హం.