
సాక్షి, బెంగళూరు: మైసూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. మాజీ మంత్రి, మైసూరు నగరంలోని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ శేఠ్‌ని ఆదివారం అర్ధరాత్రి ఫర్హాన్‌పాషా అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. మైసూరులోని పంజినా మైదానంలో బంధువుల నిశ్చితార్థానికి ఎమ్మెల్యే హాజరైన సమయంలో గౌసియానగరకు చెందిన ఫర్హాన్‌పాషా ఆయన మెడపై కత్తితో దాడి చేశాడు. ఎమ్మెల్యే మెడ నుంచి ధారగా రక్తం కారింది. భద్రతా సిబ్బంది దుండగుడిని అడ్డుకున్నారు. గాయపడిన ఎమ్మెల్యేని సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఉద్యోగం ఇప్పించలేదనే దాడి..
ఎమ్మెల్యేపై దాడి అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే తనకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించడంతో దాడి చేసినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఫర్హాన్‌పాషా ఎస్‌డీపీఐ అనే పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఎమ్మెల్యేపై దాడి నేపథ్యంలో నగరంలో పోలీసులు బందోబస్తు పెంచారు. అల్లర్లు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేను పలువురు నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment