
సాక్షి బెంగళూరు: వినియోగదారుల సమయం ఆదా చేసేందుకు స్మార్ట్ పోస్టు కియోస్క్‌ను పోస్టల్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఏటీఎం తరహాలో స్మార్ట్ పోస్టు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన పోస్టల్ విభాగం నగరంలోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం (జీపీవో)లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. దీనిద్వారా రిజిస్టర్, స్పీడ్ పోస్టులను కేవలం ఒక్క నిమిషంలోపే పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించి చూస్తున్న పోస్టల్ శాఖ భవిష్యత్తులో మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేయనుంది.
ఎలా పనిచేస్తుంది..
ఈ కియోస్క్ యంత్రం ద్వారా కేవలం స్పీడ్, రిజిస్టర్ పోస్టులను మాత్రమే పంపించుకునే అవకాశం ఉంది. తొలుత వినియోగదారులు యంత్రం ఎదుట నిలిచి తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, పోస్టు చేరుకోవాల్సిన చిరునామా తదితర వివరాలను యంత్రంలో సూచనల మేరకు పొందుపరచాలి. అనంతరం తాను పంపిస్తున్న పోస్టు రిజిస్టరా లేక స్పీడ్ పోస్టా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. అనంతరం యంత్రం స్క్రీన్ మీద పోస్టు కవర్‌పై దాని బరువు ఆధారంగా ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని చూపిస్తుంది. అనంతరం డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఐపీబీపీ కార్డును ఉపయోగించి యంత్రంలో చూపించిన మేరకు రుసుమును చెల్లించాలి. పేమెంట్ చేసిన తర్వాత బార్‌కోడ్‌తో కూడిన స్టిక్కర్ బయటకు వస్తుంది. దాన్ని పోస్టల్ కవర్‌పై అంటించి యంత్రంలో వేసేయాలి. అనంతరం యంత్రం నుంచి రసీదు ఒకటి వస్తుంది. దీంతో స్పీడు, రిజిస్టర్ పోస్టు చేయడం ముగుస్తుంది. ఆ తర్వాత తపాల విభాగం సిబ్బంది దాన్ని కోరుకున్న చోటుకి చేరవేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment