సాక్షి, ముంబై: పోలీసు స్టేషన్‌లలో మీ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకపోతే నేరుగా తనకు నేరుగా ఎస్‌ఎంఎస్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ముంబైకర్లకు పిలుపునిచ్చారు. 7738133133, 7738144144 ఫోన్ నంబర్‌లకు సంక్షిప్త సమాచారం పంపించాలన్నారు. ముంబై మహాలక్ష్మి సమీపంలోని శక్తి మిల్లు కంపౌండ్‌లో ఓ మహిళ ఫొటో జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిగిన అనంతరం సత్యపాల్ సింగ్ అప్రమత్తమయ్యారు. మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులపై నేరుగా డిప్యూటీ కమిషనర్‌లు దృష్టిసారించాలని ఆదేశాలు జారీ చేశారు. శక్తిమిల్లు కంపౌండ్‌లో అత్యాచారం సంఘటన అనంతరం తొలిసారిగా ఓ మరాఠీ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళల ఫిర్యాదులు మహిళా పోలీసులే తీసుకోవాలి. దీనిపై అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే అకతాయిలపై కఠిన చర్యలు చేపడతామ’ని చెప్పారు. దీంతోపాటు ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...
మహిళల సమస్యలు పెరిగాయా..?
మహిళల సమస్యలు పెరగడం కాదు. ఫిర్యాదులు నమోదుచేసే వారి సంఖ్య పెరిగింది. ఢిల్లీలో నిర్భయ సంఘటన అనంతరం మహిళల చేసే ప్రతి ఫిర్యాదును స్వీకరించేలా చర్యలు చేపట్టాం. ఈ ప్రక్రియ సరిగా కొనసాగుతోందా?, లేదా? అని పర్యవేక్షించే బాధ్యత జాయింట్ కమిషనర్ (లా ఆర్డర్)కు అప్పగించాం. దీంతో పాటు నెలకొకసారి అయా అంశాలను స్వయంగా సమీక్షిస్తున్నా. ఈ చర్యలతో అనేక మంది మహిళలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు నిర్భయంగా పోలీసుస్టేషన్లకు వస్తున్నారు. ఈవ్‌టీజింగ్ చేసే అకతాయిలను కొంత మేర అడ్డుకట్టవేయడంలో కూడా సఫలీకృతమయ్యాం. రైళ్లలో మహిళలపై దాడులు పెరిగిన నేపథ్యంలో వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం.
‘శక్తి మిల్లు’ ఘటన తర్వాత మీరు తీసుకున్న చర్యలే ంటి?
పోలీసు స్టేషన్‌లన్నింటిలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లు మరింత మెరుగుపరిచే విషయంపై దృష్టిసారించాం. కొన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. వాటిని భర్తీ చేస్తున్నాం. వీరికి కేవలం మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులను నమోదుచేసుకునే బాధ్యతలు అప్పగించాం. ఏసీపీ, డీసీపీలు పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ప్రతిసారీ వీరి పనితీరు సమీక్షిస్తారు.
కొన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన మహిళలను పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి కదా..?
వాస్తవమే.. ఇందుకోసమే మహిళల కోసం పోలీసు స్టేషన్లలో ప్రత్యేక ఫిర్యాదుల సెంటర్లు ఏర్పాటుచేశాం. అయితే వీటి గురించి అనేక మందికి ఇంకా తెలియదు. దీంతో ఈ ప్రత్యేక ఫిర్యాదుల సెంటర్ల గురించి తెలిపే బోర్డులను పోలీసు స్టేషన్‌లలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. రెండు మూడు రోజులలో బోర్డులు అమర్చనున్నారు. ఈ బోర్డుపై సంబంధిత ఫిర్యాదు సెంటర్‌లోని ప్రముఖ మహిళ పోలీసు అధికారి పేరు, సెల్ నంబర్ తదితర వివరాలుంటాయి. దీంతో మహిళలకు ఫిర్యాదులు చేయడంలో ఇబ్బందులు రాకపోవచ్చు.
మహిళలకు నమ్మకం కలిగించడంలో పోలీసుల వైఫల్యంపై మీ స్పందన..?
దీనికి అనేక కారణాలున్నాయి. పోలీసులపై మహిళలందరిలో విశ్వాసం, నమ్మకం పెరిగేందుకు అన్ని విధాలా పోలీసు శాఖ ప్రయత్నిస్తోంది. దీనికోసం అన్ని పోలీసు స్టేషన్ల బయట ఫిర్యాదుల పెట్టెను అమర్చాం. దీంతోపాటు మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా 103 ఫోన్ నంబర్‌ను కేటాయించాం. అలాగే నా ఫోన్ నెంబర్లు7738133133, 7738144144 కు నేరుగా ఎస్‌ఎంఎస్ చేయవచ్చు. ఈ ఎస్‌ఎంఎస్‌లను స్వయంగా ప్రతి రోజు ఉదయం పరిశీలిస్తాను. వెబ్‌సైట్‌లలో కూడా ఫిర్యాదులు చేసే వెసులుబాటును కల్పించాం. మాపై నమ్మకం ఉంచే మహిళలకు సరైన మద్దతు అందిస్తాం.
‘ఐఈఎస్’ అనే మహిళల సాఫ్ట్‌వేర్ ఏమైంది..?
ఈ సాఫ్ట్‌వేర్ పథకం కూడా కొనసాగుతోంది. అయితే దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఇందుకోసం ప్రత్యేక పద్ధతిలోనే ఫోన్ చేయగలుగుతారు. ఆ సౌకర్యంలేనివారు పైన పేర్కొన్నట్టుగా తమ సమస్యలను పోలీసులకు తెలపాలి.
‘విద్యార్థినుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి’
ముంబై: రాష్ర్టవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు మహిళా సమస్యల పరిష్కారాల కమిటీ విభాగాలు చురుగ్గా పనిచేసేలా పర్యవేక్షించాలని రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ కోరారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్ యూనివర్సిటీలో శనివారం జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులు కూడా కృషి చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్, రెచ్చగొట్టే మాటలు, అసభ్య పదజాలం ఉపయోగించడం, దుష్ర్పవర్తన తదితర అంశాలను ఎదుర్కొనేందుకు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్‌ఎంఎస్ చాలు
Published Sun, Sep 1 2013 12:16 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement