ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, బెంగళూరు : పేదలను ఆదుకోవడంలో రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బాధిత వర్గాలు ఘోసించాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ బెంగళూరులో సోమవారృం బహత్ ర్యాలీ చేపట్టాయి. అనంతరం ఫ్రీడం పార్క్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కర్ణాటక ప్రాంత రైతు సంఘం, అకిల కర్ణాటక రైతు కూలీ సంఘం, రాష్ర్ట దేవదాసీ విమోచన సంఘం, దలిత హక్కుల పోరాటా
సమితి తదితర సంఘాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడం పార్క్ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం చేపట్టిన ధర్నాలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మారుతి మాన్పడే మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతు, పేదల వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా ఇళ్లు, బగర్ హుకుం, అటవీ భూములను సాగుచేసుకుంటున్న రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య నేడు వాటిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలు నెరవేర్చడంలో సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అవద్ధి పేర్లతో ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా పచ్చని వ్యవసాయ భూములను లాక్కొంటోందని అన్నారు. ఫలితంగా రైతులు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవదాసి విమోచన సంఘం అధ్యక్షురాలు మారమ్మ మాట్లాడుతూ... దేవదాసి వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన వారిని ఆదుకునేందుకు పక్కా ఇళ్లు, ఔత్సాహికులకు సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ధర్నా సందర్భంగా మహారాణి కళాశాల వైపు ఉన్న రోడ్డును అధికారులు మూసి వేశారు. అదే సమయంలో రోడ్డుకు సమాంతరంగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.