మద్దతు కోసం సామాజిక పోరు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక వైపు ఎమ్మెల్యేలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే సోషల్ మీడియా ప్రచారంతో పన్నీరుసెల్వం పెద్ద ఎత్తున ప్రజల మద్దతు సంపాదించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, మెయిల్ ఇలా ఏ సామాజిక ప్రచార సాధనాన్ని వదలకుండా ఐదు రోజులుగా శశికళకు వ్యతిరేకంగా పన్నీరు ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారం గురించి ఇన్ని రోజులు పట్టించుకోని చిన్నమ్మ శిబిరం ప్రజల మద్దతు కూడగట్టడంలో తాము వెనుకబడ్డామని గుర్తించింది.
ఆదివారం శశికళ తన నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. పన్నీరుసెల్వం డీఎంకేతో కలసి పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారనీ, ప్రజాస్యామ్యాన్ని చెరబట్టారని పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించారు. పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి రాజ్ సత్యన్‌తో శశికళ చర్చించారు. ఒకే రోజులో లక్షల మందికి తమ వాదన వెళ్లేందుకు ఏం చేయాలని కోరారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని, పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన చెప్పారు.
ఆదివారం సాయంత్రానికి పార్టీ ఐటీ విభాగం సభ్యులతోపాటు కంప్యూటర్ సెంటర్లకు చెందిన ఐదు వేల మందితో 760 బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం నుంచి చిన్నమ్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. దీంతో పాటు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు విస్తృతంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పన్నీరుపై ఎదురు దాడి చేయాలని శశికళ పురమాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలోనూ తమకు మద్దతుగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయడం, వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం హోరెత్తించేందుకు చిన్నమ్మ రంగంలోకి దిగారు. సోమవారం పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మీదకు వచ్చి ప్రజలను కలసి వారితో కరచాలనం చేసి జనంలోకి వెళ్లేందుకు తొలి అడుగు వేశారు. పోయెస్ గార్డెన్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించడం ద్వారా తనకు కూడా జనంలో మద్దతు ఉందని చూపించే ప్రయత్నం చేశారు.
ఆమెను చిన్నమ్మ అనొద్దు: పన్నీరు వర్గం
తమ వర్గంలోని నాయకులు, కార్యకర్తలెవరూ శశికళను చిన్నమ్మ అని సంబోధించరాదని పన్నీరు వర్గం ఆదేశించింది. చిన్నమ్మ అనడం ద్వారా ఆమె జయలలిత (అమ్మ)కు ప్రతినిధి అనే అభిప్రాయం తామే కల్పించిన వారవుతామని ఆ వర్గం అభిప్రాయ పడింది. అమ్మ సమాధి సాక్షిగా తిరుగుబాటు చేసిన సమయంలో శశికళను ఉద్దేశించి చిన్నమ్మ అని సంబోధించిన పన్నీరుసెల్వం సైతం శనివారం నుంచి ఆమెను శశికళ అనే సంబోధిస్తున్నారు. శశికళ వర్గం నుంచి పన్నీరు వైపు చేరిన ఎంపీలు, ముఖ్య నేతలు సైతం తమ ప్రసంగాల్లో శశికళ అనే మాట్లాడారు. ఈ విషయాన్ని కూడా పన్నీరు శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చిన్నమ్మ నివాసం ఉంటున్న జయలలిత ఇళ్లు వేద నిలయంను స్మారక మందిరంగా మార్చే డిమాండ్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టడానికి కూడా పన్నీరు వర్గం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటోంది.
అలాగే పన్నీరుకు మీ మద్దతు ఇవ్వండి అనే నినాదంతో ప్రారంభించిన మిస్డ్ కాల్ ఉద్యమానికి 48 గంటల్లో 38 లక్షల మంది మద్దతు ప్రకటించారని అన్నా డీఎంకే ఐటీ విభాగం మాజీ కార్యదర్శి కె.స్వామినాథన్ వెల్లడించారు. ‘ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. ఓటేసిన ప్రజలను అడగండి. మీరెటు వైపు పోవాలి’ అని 2 నిమిషాల నిడివితో ఒక పాట రూపొందించి ఎమ్మెల్యేలతోపాటు, ప్రజలకు పోస్టింగ్‌లు పెట్టారు. రాజకీయ పోరాటం ఎలా ఉన్నా తనకు ప్రజలే ముఖ్యమని చెప్పే విధంగా ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం సోమవారం సచివాలయానికి వెళ్లి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. తన నివాసం వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను ఆయన కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు.