అది రాజకీయ సంస్థే
Published Sat, Jan 25 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ రాజకీయ సంస్థ అని మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆరోపిం చారు. గతంలో కమిషన్ ఇంత వేగంగా ప్రతిస్పం దించ డం చూడలేదని, తన విషయంలో కమిషన్ ఆగమేఘాలపై వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ కాంగ్రెస్ సభ్యురాలని, తన ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ఆమె రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. బర్ఖాసింగ్ దీనిపై ప్రతిస్పందిస్తూ తనను రాజీనామా చేయమనడానికి సోమ్‌నాథ్ భారతి ఎవరని ప్రశ్నించారు. తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని , మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన సోమ్‌నాథ్ భారతీయే రాజీనామా చేయాలని ఆమె అన్నారు. ఇదిలావుండగా ఢిల్లీ మహిళా కమిషన్‌పై భారతి చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఖండించింది. మహిళా కమిషన్‌ను అనవసర రాజకీయాల్లోకి లాగొద్దని ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మల సమంత్ ప్రభావకర్ అన్నారు.
డీసీడబ్ల్యూ చైర్మన్‌ను మార్చే యోచనలో ఆప్
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన ప్రస్తుత ఢిల్లీ మహిళ కమిషన్ (డీసీడబ్ల్యూ) ఛైర్మన్ బర్ఖా సింగ్‌ను తప్పించి మరొకరిని ఆ స్థానంలో నియమించాలని ఆప్ భావిస్తోంది. కావాలనే న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతీని బదనాం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, దీనివెనుక రాజకీయ గూడుపుఠాణి ఉందని అభిప్రాయపడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత బర్ఖాసింగ్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వ బోర్డులు, కమిషన్‌లలో వివిధ పదవులను అంటిపెట్టుకొని ఉన్న కాంగ్రెస్ సభ్యులను తప్పించి ఆయా స్థానాల్లో కొత్తవారిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్టు వెల్లడించాయి. ఇటీవల నగరంలో వ్యభిచారం జరుగుతున్న ఓ గృహంపై దాడి చేసిన సమయంలో ఉగాండా మహిళ పట్ల అసభ్యంగా మంత్రి సోమనాథ్ భారతీ వ్యవహరించారని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు డీసీడబ్ల్యూ చైర్మన్ బర్ఖాసింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మంత్రి సోమనాథ్‌ను తప్పించాలి: హర్షవర్ధన్
తనను ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఓ మీడియా ప్రతినిధిని మోడీ నుంచి డబ్బులు ఎంత ముట్టాయని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి చేసిన తీవ్ర వ్యాఖ్యను బీజేపీ నేత హర్షవర్ధన్ తప్పుబట్టారు. మంత్రిగా సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయని, ముఖ్యమంత్రి ఆయనను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సోమనాథ్ ఆరోపణలని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ (బీఈఏ) జనరల్ సెక్రటరీ ఎన్‌కె సింగ్ కూడా ఖండించారు. ఇది నిరాధారమైన అనవసరమైన ఆరోపణ అన్నారు. ఒక వ్యక్తి నిస్పృహతో చేసిన ఆరోపణ గా అభివర్ణించారు.
Advertisement
Advertisement