![హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71414616392_625x300.jpg.webp?itok=68w7bST8)
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా?
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా? అని ప్రశ్నిస్తున్నారు దర్శకుడు మిష్కిన్. ఈయన దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుదన్నదానికి ఆయన గత చిత్రాలే నిదర్శనం. చిత్తిరం పేసుదడి, అంజాదే, ఓనాయం ఆటుకుట్టి తదితర చిత్రాల రూపకర్త మిష్కిన్ తాజాగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం పిశాచు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తన బి స్టూడియోస్ పతాకంపై నిర్మించడం విశేషం. హర్రర్ చిత్రా ల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో మిష్కిన్ కూడా ఇదే బాట పట్టారు. అయితే తన హర్రర్ చిత్రం ఇంతకుముందు చిత్రాలకు భిన్నంగా, వినూత్నంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈయన ఈ చిత్రం గురించి తెలుపుతూ, తన దృష్టిలో భయ పెట్టేవే హర్రర్ చిత్రాలు కావన్నారు. తన పిశాచు చిత్రంలో భయంతోపాటు, గుండెల్ని పిండే అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించిన వారి నుంచి చిన్న పాత్రల్లో నటించిన వారి వరకు 4 నెలల పాటు శిక్షణ ఇచ్చి నటింపజేసినట్లు తెలిపారు. పిశాచు చిత్రం ద్వారా నాగ అనే నవ నటుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. తొలి చిత్రంలోనే ఈయన నటనలో అదరగొట్టాడని అన్నారు.
హీరోయిన్‌గా కేరళకు చెందిన ప్రియూంకను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నృత్యంలో ప్రావీణ్యం పొందిన ఈమె 60 అడుగుల ఎత్తులో ఒక రాత్రంతా పిశాచిగా ఎగురుతూ నటించి యూనిట్‌లోని వారందరినీ ఆశ్చర్య పరిచిందని చెప్పారు. కెమెరామెన్ రవిరాయ్ ఈ సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించారని తెలిపారు. అదే విధంగా అరోల్ కారేలి అనే నూతన సంగీత దర్శకుడిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. పిశాచు చిత్రానికి చివరి ఘట్టమే ప్రాణం అని మిష్కన్ పేర్కొన్నారు.