న్యూఢిల్లీ: రాజధాని నగరంలోని ఓ చర్చిలో అనుమానాస్పద రీతిలో మంటలు చెలరేగడంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. చర్చి దగ్ధం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని న్యాయవిచారణకు ఆదేశించాలని క్రైస్తవ సమాజం డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాలలో కూడా తమ మతం వారిపై జరుగుతున్న హింసపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈశాన్య ఢిల్లీలోని తాహిర్‌పూర్‌లో గల సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అంతకుముందు ఢిల్లీ ఆర్చ్‌బిషప్ అనిల్ కౌటో నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం ఎల్జీని కోరింది. ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత లేదా విశ్రాంత జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేవలం ఢిల్లీ చర్చి దగ్ధం ఘటనపైనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్వేషపూరితమైన ప్రచారంపై కూడా దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. రాజధాని నగరంలో మతపరమైన హింసను తామెంతమాత్రం సహించబోమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. చర్చి దగ్ధం ఘటనపై దర్యాప్తును వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.
వేలాది మందితో ప్రదర్శన
చర్చి దగ్ధం ఘటనను నిరసిస్తూ వేలాది మంది క్రైస్తవులు ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని, చర్చి ఆస్తులకు భద్రతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఐటీఓ జంక్షన్‌ను రెండు గంటల పాటు స్తంభింప చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులు పోలీసు కార్యాలయంలోపలికి బలవంతంగా ప్రవేశిం చేందుకు విఫలయత్నం చేశారు. చర్చిని దగ్ధం చేసిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేశారని రాష్ట్రీయ ఇసాయి మహాసంఘ్ ప్రతినిధి అనితా బెంజమిన్ ఆరోపించారు. చర్చి ఆఫ్ నార్త్ ఇండియా బిషప్ కరమ్ మసీహ, పౌర హక్కుల నాయకుడు డాక్టర్ జాన్ దయాళ్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో ప్రస్తావన
చర్చి దగ్ధం ఘటనను పార్లమెంట్‌లో పలువురు విపక్ష నేతలు ఖండించారు. లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సీపీఎం సభ్యుడు కరుణాకరన్, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చర్చిని దగ్ధం చేశారని ఆరోపించారు. పోలీసులు కూడా ఆలస్యంగా అక్కడికి వచ్చారని, అప్పటికి అంతా కాలి బూడిదయ్యిందని అన్నారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు సైతం ఈ ఘటనను ఖండించారు.
చర్చి దగ్ధంపై సిట్ దర్యాప్తు
Published Tue, Dec 2 2014 11:17 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement
Advertisement