పోలీసుల అదుపులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు(ఫైల్)
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెరపైకి తీసుకొస్తోంది. అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు.. నేరాలపై చర్యలు తీసుకోకుండా ‘సిట్’ పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకుంటోంది. కుంభకోణాలు, సంచలన çఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం.. ఆ తర్వాత నివేదికలను బుట్టదాఖలు చేయడం, విచారణను అటకెక్కించడం పరిపాటిగా మారింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజులు గడిచినా ఇప్పటిదాకా ‘సిట్’ తేల్చిందేమీ లేకపోవడం గమనార్హం.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖలో భూ కుంభకోణం, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుపై ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్, తాజాగా విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై సిట్ దర్యాప్తులతో ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (కాల్‌డేటాను దాటని విచారణ)
► శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర సర్కారు 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు అసలు నేరస్తుల పాత్ర బయటపడలేదు.
► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును టీడీపీ అభ్యర్థికి వేయించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తుండగా, 2015 మే నెలలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై ఏపీలో 88 ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు 2015 జూన్ 17న సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ అడ్రసు లేకుండా పోయింది.
► విశాఖపట్నం రూరల్‌లో అధికార టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్‌లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంలో టీడీపీ మంత్రులు, నేతలదే ప్రధాన పాత్ర అని తేలడంతో ‘సిట్’ విచారణ అటకెక్కేసింది.
► విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలే ఉప్పందించారని పోలీసులు నిర్ధారించి అరెస్టులు కూడా చేశారు. కానీ, సిట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, నివేదిక ఇవ్వకుండా అర్ధంతరంగా వదిలేశారు.
► విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరులలో భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి, అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది.
► రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు మూడేళ్లు దాటినా అతీగతీ లేదు.
థర్ట్‌పార్టీ దర్యాప్తు ఎందుకంటే..
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార పార్టీ నేతల అరాచకాలను ఇప్పటివరకు ఏ ఒక్క సిట్ కూడా తేల్చలేకపోయింది. ఒక్కరికైనా శిక్ష పడేలా ఆధారాలను సంపాదించలేదు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగిన రోజే వారు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో(థర్డ్ పార్టీ) విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment