మదన్ కోసం ఐదు పోలీస్ బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ మదన్‌ను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాలు వసూలు చేసి ఆ మొత్తాన్ని సంస్థ నిర్వాహకులకు అప్పగించానని ఒక లేఖలో పేర్కొని పరారైన మదన్ రెండున్నర నెలలుగా చెన్నై పోలీసులను నీళ్లు తాగిస్తున్నారు.ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.మదన్ ఇద్దరు భార్యలు,తల్లి ఆయన ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించాల్సిందిగా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు మదన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.దీంతో నేరపరిశోధనా విభాగం పోలీస్ అధికారులు మదన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.మదన్ ఎక్కడికి పారిపోయారన్నది కచ్చితంగా తెలియకపోయినా సందేహంతో కాశీ, నేపాల్ అంటూ ఉత్తరాది ప్రాంతాలతో పాటు దక్షిణాదిలోని కేరళ,తమిళనాడులోని తిరుపూర్, ఇతర ప్రాంతాలలో ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.అయితే ఇప్పటికీ మదన్ జాడ తెలియలేదు.
మరో పక్క హైకోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తోంది.రెండున్నర నెలల క్రితం అదృశ్యం అయిన మదన్ నాటి నుంచి నేటి వరకూ సెల్‌ఫోన్‌ను వాడటం లేదట. దీంతో ఆయన ఆచూకీ కనుగొనడం పెద్ద సమస్యగా మారిందని పోలీసులు వాపోతున్నారు.మదన్ స్నేహితులపై నిఘా పెట్టినట్లు త్వరలోనే ఆయన్ని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పారివేందర్‌కు బెయిల్
మదన్ మోసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం అధినేత పారి వేందర్‌కు గురువారం సాయంత్రం నిబంధనలతో కూడిన బెయిలును చెన్నై మెజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేసింది. 75 కోట్ల రూపాయలను,10 లక్షలతో పాటు ఇద్దరు వ్యక్తులను పూచీకత్తును, చెన్నై,సైదాపేట 11వ న్యాయస్థానంలో జమ చేసి బెయిల్ పొందాల్సిందిగా కోర్టు ఆదేశించింది.