ఆశ్రమవాసుల ఆత్మహత్య
పుదుచ్చేరిలో ఆధ్యాత్మిక బోధనలతో అలరారే అరవింద ఆశ్రమం వివాదాల్లో కూరుకుపోయింది. ఆశ్రమంలోని మహిళలపై లైంగిక వేధింపులు, ఆత్మహత్యలతో అట్టుడికిపోయింది. ఆశ్రమంలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులు ముగ్గురు మహిళలను బలితీసుకోగా, మరో నలుగురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. గురువారం జరిగిన సంఘటనలోని ఏడుగురు బాధితులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం దయనీయం.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రసిద్ధ ఆధ్యాత్మిక, తత్వవేత్త అరవిందుడు దేశ విదేశాల్లో విస్తృత సంఖ్యలో అరవింద ఆశ్రమాలను స్థాపించారు. పుదుచ్చేరిలో సైతం ఆశ్రమ శాఖ ఉంది. భౌతిక కర్మలకు దూరంగా ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారు తమ స్థిర, చరాస్తులను ఆశ్రమానికి విరాళమిచ్చి ఆశ్రమంలోనే గడుపుతుంటారు. ఆశ్రమంలో నివసించే వారి కోసం వైట్ టౌన్ అనే పేరుతో కాటేజీలు నిర్మించారు. వీటిల్లో ఉత్తరాదికి చెందినవారు 5 వేల మందికి పైగా నివసిస్తున్నారు. బీహార్‌కు చెందిన ప్రసాద్ (86), శాంతాదేవీ (78) దంపతులు సైతం అదే కోవలో పుదుచ్చేరికి చేరుకున్నారు. అయితే వీరిద్దరూ పుదుచ్చేరిలోనే వేరుగా నివసిస్తుండగా, వీరి కుమార్తెలైన జయశ్రీ (54), అరుణశ్రీ (52), రాజశ్రీ (49), నివేదిత (42), హేమలత (39) ఆశ్రమంలో నివసిస్తున్నారు.
ఆశ్రమంలో చేరేవారు ఇక్కడి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, హద్దుమీరిన వారిని పంపివేస్తామనే షరతుతోనే చేర్చుకుంటారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఐదేళ్ల క్రితం పుదుచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయితే కేసు నమోదు కాలేదు. దీంతో వారంతా స్థానిక కోర్టు ద్వారా ఫిర్యాదు నమోదు చేయించారు. ఆశ్రమంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఆశ్రమాన్ని విడిచివెళ్లిపోవాలని నిర్వాహకులు హుకుం జారీచేశారు. చిన్ననాటి నుంచి ఆశ్రమంలోనే గడుపుతున్నందున తమను పంపడానికి వీల్లేదంటూ అక్కాచెల్లెళ్లు కోర్టులో కేసు వేశారు.
మూడు కోర్టుల్లోనూ ఆశ్రమానికే అనుకూలంగా తీర్పురావడంతో అక్కాచెల్లెళ్లు ఖాళీ చేయకతప్పలేదు. సుప్రీం తీర్పు వెలువడినా ఆశ్రమం వీడేందుకు వారు ససేమిరా అనడంతో నిర్వాహకులు బుధవారం పోలీసులను వెంటపెట్టుకుని వెళ్లారు. తమను వెలుపలకు పంపితే సాముహికంగా ఆత్మహత్యకు పాల్పడతామని వారు హెచ్చరించారు. ఈ ఐదుగురిలోని హేమలత ఆశ్రమంలోని నాలుగో అంతస్తుకు ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యూరు. గందరగోళం నెలకొందని తెలుసుకున్న మీడియా, పోలీసులు ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. మీడియాతో మాట్లాడేందుకు హేమలత అనుమతించడంతో ఓ పోలీసు అధికారి మఫ్టీలో మిద్దెపైకి చేరుకున్నారు.
విలేకరిలాగా ఆమెను సమీపించి హఠాత్తుగా ఒడిసిపట్టుకున్నారు. అనంతరం ఐదుగురు అక్కాచెల్లెళ్లను పోలీసులు ఆశ్రమం నుంచి వెలుపలకు పంపించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆశ్రమం నుంచి బలవంతంగా గెంటివేయడాన్ని ఆ కుటుంబమంతా అవమానంగా భావించింది. ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఐదుగురు అక్కాచెల్లెళ్లు గురువారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో సుముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అత్యంత లోతైన ప్రదేశం వచ్చి విడిపోయేవరకు ఒకరికొకరు చేతులు పట్టుకునే నడిచారు. ఏడుగురు వ్యక్తులు ఒకేసారి ఆత్యహత్యకు పాల్పడటాన్ని గమనించిన మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ముగ్గురు సముద్రపు అలలకు గల్లంతైపోయారు. చేతికి చిక్కిన నలుగురిని ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వచ్చి వారందరినీ పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సముద్రపు అలల్లో గల్లంతైన తల్లి శాంతాదేవి, కుమార్తెలు అరుణశ్రీ, రాజశ్రీ శవాలు గురువారం మధ్యాహ్నం సమయానికి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. తండ్రి ప్రసాద్, కుమార్తెలు నివేదిత, జయశ్రీ, హేమలతల పరిస్థితి విషమంగా ఉంది.
ప్రజా సంఘాల ఆందోళనలు
అరవింద ఆశ్రమానికి వ్యతిరేకంగా అనేక ప్రజా సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. ఆత్మహత్య వార్త దావానలంలా వ్యాప్తి చెందడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి తందెపైరియార్ కళగంకు చెందిన 30 మంది ఆశ్రమానికి చేరుకుని నినాదాలు చేశారు. ఆశ్రమంలోనికి ప్రవేశించేందుకు చేసే ప్రయత్నంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా 30 మందిని అరెస్ట్ చేశారు. తమిళర్గళం, తమిళ వాళ్వురిమై కట్చికి చెందిన 50 మంది ఆందోళన చేశారు. సీపీఎం కార్యకర్తలు ఆశ్రమాన్ని చుట్టుముట్టి వివాదాలమయమైన ఆశ్రమానికి సీల్‌వేయాలని, ఆత్మహత్యలకు కారకులైన నిర్వాహకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి, ఆశ్రమానికి చెందిన పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు. డీఎంకే కార్యకర్తలు స్థానిక పోస్ట్‌ఆఫీసు మందు ధర్నా నిర్వహించారు.