వైభవంగా శ్రీనివాస కల్యాణం
Published Mon, Oct 7 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
టీ.నగర్, న్యూస్‌లైన్: చెన్నై పెరంబూరులోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీనివాస కల్యాణ వైభవంగా జరిగింది. చెన్నై మూలకడై జంక్షన్‌లోని వల్లి మహల్‌లో కల్యాణోత్సవం జరిగింది. కాంచీపురం వరదరాజ పెరుమాల్ ఆస్థాన పండితులు రంగన్ భట్టాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీనివాస కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎన్.కన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన టీటీడీలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరిం చారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 21 ఏళ్లుగా శ్రీనివాస కల్యాణం నిర్వహిం చడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రెసిడెంట్ తమ్మినేని బాబు మాట్లాడుతూ శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శనివారం రాత్రి పెరంబూరు ఆనంద నిలయం ఆధ్వర్యంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగిందన్నారు. ఈ ఊరేగింపు నాలుగు వీధులు తిరిగి ఆనంద నిలయం చేరుకోగా రాత్రి 9.30 గంటలకు నిశ్చితార్థం కార్యక్రమం జరిగిందన్నారు.
మూలకడై వల్లిమహల్ లో ఆదివారం ఉదయం జరిగిన కల్యాణోత్సవంలో స్వామి వారికి గణపతి హోమం, అభిషేకం, తిరుమంజనం, ఉయ్యాల సేవ, పూల దండల మార్పు, మహా దీపారాధన నిర్వహించినట్టు తెలిపారు. వరుడి తరపున శ్రీనివాసన్ దంపతులు, శ్రీదేవి, భూదేవి తరపున డి.జంబులింగం దంపతులు ఉభయదారులుగా పాల్గొని కల్యాణం జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం కార్యదర్శి ఆర్‌ఎం శేషన్, కోశాధికారి డి.రామలింగం పాల్గొన్నారు.
Advertisement