నాసిక్‌లో జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరిగే కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది...
- 1000 సీసీటీవీ కెమెరాలతో నిఘా..పోలీసుల పహారా
- అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక ఏర్పాట్లు
ముంబై: నాసిక్‌లో జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరిగే కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. కుంభమేళాకు మొదటి పదిహేను రోజుల్లో 12 నుంచి 13 లక్షల ప్రజలు హాజరవుతారని ముఖ్య కార్యనిర్వహణాధికారి బీకే ఉపాధ్యాయ అంచనావేశారు.
ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నామని ఆయన తెలిపారు. 1000 సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన, ఇతర రాష్ట్రాల పోలీసులు సాధారణ దుస్తుల్లో గస్తీ కాస్తారని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండటానికి నాసిక్‌లో ప్రత్యేక ఆరోగ్య విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2003 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది యాత్రికులు మృతి చెందగా, 57 మంది గాయపడ్డారు.