న్యాయమూర్తుల పదవుల భర్తీకి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది.
Published Mon, Aug 19 2013 4:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
మద్రాసు హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవుల భర్తీకి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. ఎనిమిది మందిని న్యాయమూర్తులుగా నియమించేందుకు పచ్చజెండా ఊపింది. ఇందులో ఆరుగురు సీనియర్ న్యాయవాదులు ఉండడం విశేషం.
సాక్షి, చెన్నై: అత్యుత్తమ తీర్పులతో మద్రాస్ హైకోర్టు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. దీని పరిధిలో మదురై ధర్మాసనం, పుదుచ్చేరి ప్రత్యేక కోర్టు, 29 సహాయకోర్టులు ఉన్నాయి. హైకోర్టు ఇటీవలే 150వ వార్షికోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం హైకోర్టులో 60 మంది న్యాయమూర్తులు ఉండాలి. కొందరు పదోన్నతులపై వెళ్లారు. మరికొందరు పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో 20 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినా సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేయలేదు. ఇందుకు కారణం ఇక్కడి నుంచి పదిహేను మంది పేర్లతో వెళ్లిన జాబితాలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలే. అలాగే మహిళలకు రిజర్వేషన్ వర్తింపజేయాలంటూ మహిళా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తోంది. న్యాయమూర్తుల నియామకం బహిరంగంగానే జరగాలని, సీల్డ్ కవర్లలో జాబితా పంపించ వద్దని పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎట్టకేలకు ఆమోదం: న్యాయమూర్తుల పదవుల భర్తీకి సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. పదిహేను మంది పేర్లతో వచ్చిన జాబితాను పరిశీలించి ఎనిమిది మంది నియూమకానికి పచ్చ జెండా ఊపింది. మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటించినట్లు సమాచారం. కొత్తగా ఎంపికైన న్యాయమూర్తుల్లో ఆరుగురు న్యాయవాదులు ఉన్నారు. వీరిలో టి.ఎస్.జయకుమార్, వైద్యనాథన్, వి.ఎం.వేలుమని, పుష్పా సత్యనారాయణ, ఆర్. మాధవన్, కె.కళ్యాణ సుందరం ఉన్నారు. అలాగే కింద కోర్టుల్లో పనిచేస్తున్న వి.ఎస్.రవి, చొక్కలింగంలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. వీరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం పడ్డట్టే.
Advertisement
Advertisement