నోయిడా: మహిళా శక్తి సమాజిక్ సమితి సభ్యులు గ్రేటర్ నోయిడా నగరంలోని పార్కుల్లో ఆకస్మిక తనిఖీలను మళ్లీ ప్రారంభించారు. పార్కుల్లోని ఆహ్లాదకరమైన వాతావారణాన్ని ఆస్వాదించాలే తప్ప అసభ్యంగా ప్రవర్తించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నామని సమితి సభ్యులు చెబుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా జంటలు వ్యవహరించాలని సూచిస్తున్నామని అంటున్నారు. కానీ, ఇది ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని, అయితే స్వచ్ఛందంగా సమితి సభ్యులు పార్కులను తనిఖీలు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
గత నెలలో జంట పట్ల దురుసుగా..
గత నెలలో నగరంలోని పార్కుల్లో నైతిక పరివర్తన పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సమితి సభ్యులు ఓ జంట పట్ల దురుసుగా వ్యవహరిం చారు. దీంతో సభ్యులకు పోలీసులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇది గడిచి నెల రోజులు కాక ముందే సమితీ సభ్యులు మళ్లీ గురువారం పార్కుల్లో నైతిక ప్రవర్తనపై పర్యాటకులకు అవగాహన కల్పించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పర్యాటకుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సమితి చర్యలను పోలీసులు తప్పుబడుతున్నారు.
నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పిస్తున్నాం.. రూపా గుప్తా
సమితి అధ్యక్షురాలు రూపా గుప్తా మాట్లాడుతూ.. సమితికి చెందిన ఆరుగురు మహిళలు, స్థానికులు కలిసి రోజూ సాయంత్రం పార్కులను తనిఖీలు చేస్తారని చెప్పారు. ఈ తనిఖీల ద్వారా అనుకూల ఫలితాలు సాధించామని చెప్పారు. మొదటి డ్రైవ్‌లోనే చాలామంది ప్రజల్ని పార్కుల్లో గౌరవంగా ఉండేలా అవగాహన కల్పించామని చెప్పారు. పార్కుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే అంశాలపై కొన్ని జంటలకు అవగాహన కల్పించామని చెప్పారు. అసభ్యంగా వ్యవహరించడం తప్పుగా సూచించామని, ఇలాంటి దృశ్యాలు పార్కులకు వచ్చే చిన్నారులపై దుష్ర్పభావాన్ని చూపుతాయని సూచించారు. ప్రధానంగా భారతీయ సమాజం ఉన్నతిని పరిరక్షించే నైతిక విలువ గురించి వివరించామని చెప్పారు. గతవారం చేపట్టిన ‘పార్కుల్లో నైతిక ప్రవర్తనపై స్పెషల్ డ్రైవ్’ సత్ఫలితాలిచ్చిందని అన్నారు. ఇలాంటి సమయంలో నగర పోలీసులు సమితి సభ్యులకు సహకరించాలని కోరారు. తనిఖీల సమయంలో పోలీసులు దూరంగా ఉండాలని కోరారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: ఎస్‌హెచ్‌ఓ
‘మేం కూడా పార్కుల్లో నైతిక పరివర్తనపై పర్యాటకులకు అవగాహ కల్పించాలని నిర్ణయించాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తాం, కానీ సమితీ సభ్యులతో కలిసి పనిచేయలేమని ఎస్‌హెచ్‌ఓ సమర్‌జిత్‌సింగ్ కాసనా అన్నారు. గతవారం సమితి సభ్యులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో దురుసుగా వ్యవహరించారని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు.
నోయిడా పార్కుల్లో ‘మహిళా శక్తి’
Published Thu, Oct 9 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement