సాక్షి, బెంగళూరు: మీ ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయా? వాటికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏంటి.. అది కుక్కలకి ఏంటి అనుకుంటున్నారా!! ఇప్పటివరకు అయితే కుక్కలకు లైసెన్స్ తప్పనిసరి కాకపోయిన ఇకపై త్వరలో బీబీఎంపీ పరిధిలో కుక్కలకు లైసెన్స్‌లు కచ్చితం కానుంది. ఈ మేరకు బీబీఎంపీ ఆలోచన చేస్తోంది. బీబీఎంపీ పరిధిలో అపార్ట్‌మెంట్ అసోసియేషన్ నియమాల ప్రకారం లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆదివారం కబ్బన్ పార్కు క్యానిన్స్ (సీపీసీ) స్వచ్ఛంద సేవకులు, బీబీఎంపీతో కలుపుకుని కుక్కలకు లైసెన్స్‌లనే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.
ఆదివారం పెంపుడు కుక్కకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు, వ్యాక్సినేషన్ వివరాలతో పాటు అడ్రస్ ప్రూఫ్‌తో యజమానులు తమ కుక్కలను కబ్బన్ పార్కుకు తీసుకొచ్చారు. ఈ లైసెన్స్‌కు బీబీఎంపీ రూ. 110 చార్జీ చేసింది. లైసెన్స్ తీసుకున్న పెంపుడు కుక్కలకు ఉచిత హెల్త్ చెకప్, రాయితీతో కూడిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీసీ వ్యవస్థాపకురాలు ప్రియా చెట్టి మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు లైసెన్స్‌లు తీసుకోవడం ప్రతిఒక్క యజమాని బాధ్యతని చెప్పారు. భారత జంతు సంక్షేమ సంస్థ (ఏడబ్ల్యూబీఐ) నియమాల ప్రకారం కూడా దేశంలో ఎక్కడైన పెంపుడు కుక్కలకు లైసెన్స్‌లు తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కలతో కబ్బన్ పార్కులో సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment