
కోమా నుంచి బయటపడిన స్వప్నాలి
సాక్షి, ముంబై: నాలుగు నెలలుగా కోమాలో ఉన్న స్వప్నాలి లాడ్ ఆదివారం స్ఫృహలోకి వచ్చింది. ఆమె ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతోందని వైద్యం చేస్తున్న డాక్టర్లు వెల్లడించారు. ఠాణేకి చెందిన స్వప్నాలి ఆగస్టు ఒకటో తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలు దేరింది. ఠాణే రైల్వే స్టేషన్ బయట ఆటో ఎక్కింది. కాని డ్రైవర్ తను రోజు వెళ్లే రూట్‌లో కాకుండా మరో రోడ్డు మీదుగా ఆటోను పోనిచ్చాడు. దీనిపై నిలదీసినప్పటికీ అతడు సమాధానమివ్వలేదు. దీంతో తనను అపహరిస్తున్నట్లు గుర్తించిన స్వప్నాలి వేగంగా వెళుతున్న ఆటోలో నుంచి దూకేసింది.
ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆపస్మారక స్థితిలోనే ఉంది. ప్రస్తుతం ఆమె శరీరం సహకరిస్తోందని, వెంటిలేటర్ అవసరం లేదన్నారు. ఇక ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులు వెల్లడించారు. అయితే మనుషులను ఇంకా గుర్తించడం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటే అసలు ఆ రోజు ఏం జరిగింది...? ఆ ఆటో డ్రైవర్ ఎవరు..? అనేది వివరాలు బయటపడతాయి. దీంతో నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులకు మార్గం సుగమం కానుంది.