నేడు చర్చలు
Published Mon, Jan 27 2014 12:58 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. శ్రీలంక - భారత సరిహద్దుల్లో ఎంపిక చేసిన ప్రదేశంలో పారంపర్యంగా వస్తున్న చేపల వేటను కొనసాగించలేని పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నా, శ్రీలంక నావికాదళం మాత్రం తన పనితనాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు రెండు దేశాల జాలర్లను ఓ చోట కూర్చోబెట్టి సామరస్య పూర్వక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా తేదీ వాయిదా పడటంతో ఈ చర్చలు సాగేనా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం డీఎంఎస్ ఆవరణలోని సమావేశ మందిరంలో చర్చలకు ఏర్పాట్లు చేశారు.
ఉదయం పది గంటలకు చర్చలు ఆరంభం కానున్నాయి. ఇందులో రెండు దేశాల జాలర్లు పారంపర్యంగా చేపలను వేటాడుతున్న ప్రదేశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా కచ్చ దీవులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తమ మీద జరుగుతున్న దాడుల అడ్డుకట్ట లక్ష్యంగా, చేపల వేటలో ఉపయోగించాల్సిన వలలు తదితర అంశాలతో పాటుగా రెండు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుకు దారితీసే రీతిలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శ్రీలంక నుంచి జాలర్ల ప్రతినిధి బృందం చెన్నైకు ఆదివారం చేరుకుంది. ఆదేశానికి చెందిన అంతోని ముత్తు నేతృత్వంలో 15 మంది ఉదయం మీనంబాక్కం విమానాశ్రయం చేరుకున్నారు.
వీరిని గట్టి భద్రత నడుమ నగరంలోని ఓ హోటల్‌కు తరలించారు. రామేశ్వరం, నాగపట్నం, పుదుకోట్టై, రామనాథపురం నుంచి రాష్ట్ర జాలర్ల బృందాలు ఇక్కడికి చేరుకున్నారుు. చర్చల్లో శ్రీలంకకు చెందిన పదిమంది ప్రతినిధులు, రాష్ట్రానికి చెందిన పది మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయపాల్, అధికారులు విజయకుమార్, మునియనాథన్, రంగరాజన్ భేటీకి నేతృత్వం వహించనున్నారు.దాడి: రెండు దే శాల జాలర్లు చర్చలకు సిద్ధమవుతోంటే, శ్రీలంక నావికాదళం ఆదివారం మండపం జాలర్లపై విరుచుకు పడింది. శనివారం రాత్రి మండపం నుంచి చేపల వేటకు వెళ్లిన ఐదు పడవలను చుట్టుముట్టి చితకబాది పంపించింది. ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్న బాధితులు తమపై జరిగిన దాడిని మీడియా, అధికారుల దృష్టికి తెచ్చారు. చర్చల్లో ఈ దాడి కలకలం ఎలాంటి ప్రకంపన సృష్టించబోతుందో వేచి చూడాల్సిందే.
Advertisement