విశాల్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా?
చెన్నై: నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్‌కు తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. తమిళ నిర్మాతల మండలి కార్యవర్గంపై నిరాధార ఆరోపణలు చేశారంటూ నటుడు విశాల్‌ను మండలి నుంచి తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో తనపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నటుడు విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై వాధించిన నిర్మాతల మండలి తరఫు న్యాయవాది విశాల్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసే విషయం గురించి నిర్మాతల మండలి చర్చిస్తుందని పేర్కొన్నారు. నటుడు విశాల్ గత 4వ తేదీన నిర్మాతల మండలి గురించి తన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, అవి ఎవరినైనా బాధించినట్లయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి కోర్టులో విచారణకు వచ్చింది.
నిర్మాతల మండలి తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ విశాల్‌పై నిషేధం ఎత్తివేసేందుకు మండలి నిరాకరించిందన్నారు. ఆయనను మండలి తాత్కాలికంగా బహిష్కరించినా విశాల్ ఆరోపణలు చేస్తూనే ఉండడం వల్ల నిషే«ధాన్ని కొనసాగించాలని, ఆయన విచారాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి తీర్మానంలో పేర్కొందని కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా పిబ్రవరి 5న జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తమ జట్టు పోటీ చేస్తుందని ఇప్పటికే వెల్లడించడమే గాకుండా అధ్యక్ష పదవికి నటి కుష్బూ పేరును కూడా ప్రకటించిన విశాల్‌కు ఇది షాక్ ఇచ్చే విషయమే. నిర్మాతల మండలి ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్టయితే ఆయన రానున్న ఎన్నికల్లో తనకూ ఏదో ఒక ప్రధాన పదవికి పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడా అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే ఈ నెల 8వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. మరి ఇలాంటి పరిణామాల్లో నటుడు విశాల్ తదుపరి చర్య ఏమిటన్నది వేచి చూడాల్సిందే.