విలీనం అనుమానమే! | Tamil Nadu Don't want merger, says OPS camp's Salem unit | Sakshi
Sakshi News home page

విలీనం అనుమానమే!

Published Sun, Apr 30 2017 3:55 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

విలీనం అనుమానమే!

విలీనం అనుమానమే!

మద్దతుదారులతో పన్నీరు మంతనాలు
ఆ రెండు డిమాండ్ల మీద పట్టు
నాన్చుడు వద్దు అని మంత్రి జయకుమార్‌ ఆగ్రహం
సేలంలో సీఎం సమాలోచన


సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాల విలీనం అనుమానంగా మారింది. మద్దతుదారులతో పన్నీరు సెల్వం శనివారం సుదీర్ఘ మంతనాల్లో మునిగారు. శశికళ, దినకరన్‌లకు శాస్వత ఉద్వాసన, అమ్మ మరణం మిస్టరీ ఛేదింపునకు న్యాయ విచారణకు పట్టుబడుతూ, అవి నెరవేరే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు. పన్నీరు శిబిరం నాన్చుడు ధోరణి సాగించడాన్ని మంత్రి జయకుమార్‌ తీవ్రంగా ఖండించారు. వస్తే, వస్తాం...లేదంటే ...అంటూ ఏదో ఒక విషయాన్ని తెల్చాలని హెచ్చరించారు.

సాక్షి, చెన్నై  : అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో మమేకం అయ్యేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరం నిర్ణయించిన విషయం తెలిసిందే. తమ షరతులకు తలొగ్గినప్పుడే చర్చలు అన్న అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకు తగ్గట్టుగా అమ్మ శిబిరానికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న సీఎం పళనిస్వామి అడుగులు సాగుతూ వస్తున్నాయి. చర్చలు నిమిత్తం ఒకే వేదిక మీదకు వచ్చే సమయంలో ఏదో ఒక అడ్డంకితో వాయిదాల పర్వం సాగింది.

గత వారం ఇరు వర్గాల మధ్య బయలు దేరిన మాటల తూటాలతో ఇక చర్చలకు స్వస్తి పలికినట్టే అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే ఎవరో ఒక్కరు తగ్గడం, తదుపరి రహస్యంగా మంతనాలు సాగడం చోటు చేసుకున్నాయి. రహస్యమంతనాల్లో పన్నీరు శిబిరానికి పళని శిబిరం ఆఫర్లు ఇచ్చినా వాటిని ఖాతరు చేయలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో అమ్మ శిబిరంతో విలీనం వద్దే వద్దన్న నినాదం సేలం వేదికగా బయలు దేరడంతో పన్నీరు డైలమాలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరిస్థితులు తమకు అనుకూలంగానే మున్ముందు ఉంటాయన్న భావనతో పన్నీరు మద్దతు దారులు  ఆ వ్యాఖ్యలు అందుకున్నా, అందరి అభిప్రాయ సేకరణలో మాజీ సీఎం నిమగ్నమయ్యారు.

మంతనాలు : విలీనం వద్దే వద్దంటూ బయలు దేరిన నినాదాన్ని పరిగణించి మద్దతుదారులతో పన్నీరు శనివారం మంతనాల్లో మునిగారు. చర్చలకు వెళ్దామా? వద్దా అన్నది తేల్చే రీతిలో ఈ మంతనాలు సాగాయి. ఆ శిబిరానికి చెందిన కేపీ మునుస్వామి, మధుసూదనన్, నత్తం విశ్వనాథన్, పాండియరాజన్, పొన్నయ్యన్, సెమ్మలై, మనోజ్‌ పాండియన్, మైత్రేయన్‌ నేతలతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తదుపరి సాయంత్రం పన్నీరు సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నీరు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విషయాన్ని తేల్చుతారని భావించినా, చివరకు ఆ శిబిరం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

అయితే, మైత్రేయన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు డిమాండ్లే తమకు ముఖ్యం అని, వాటిని నెరవేర్చని తదుపరి చర్చల గురించి ఆలోచిద్దామని స్పందించడం గమనార్హం. ఇక, పొన్నయ్యన్‌ మాట్లాడుతూ తమను చర్చలకు పిలిపించి, లోపల శశికళ, దినకరన్‌లకు మద్దతుగా ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు చేయించారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పాండియరాజన్‌ పేర్కొంటూ, తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు తీసుకున్నారో బయట పెట్టాలని పళని శిబిరాన్ని ప్రశ్నించడంతో, విలీనం ఇక డౌటేనన్నది స్పష్టం అవుతోంది.

అయితే, తాజాగా పన్నీరు శిబిరం స్పందన మేరకు ఆదివారం పళని శిబిరం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో,  ఇక  ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ఉదయాన్నే మీడియా కదిలించగా, నాన్చుడు ధోరణి మంచి పద్ధతి కాదని విమర్శించారు. విలీనం చర్చలువద్దే వద్దంటూ సేలంలో బయలు దేరిన నినాదం, పన్నీరు గళమా...? లేదా అక్కడి నేతల నినాదమా అన్నది స్పష్టం చేయాలన్నారు. ఎవరు వచ్చినా రాకున్నా, తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం పళనిస్వామి సేలంలో పార్టీ వర్గాలతో విలీన చర్చల విషయంగా సమావేశం కావడం గమనార్హం.

 ఇక, ఈ విలీనం ఓ హైడ్రామా అని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. కమలం పెద్దల కనుసనల్లో ఈ డ్రామా సాగుతోందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టడం, విలీనం అంటూ, చర్చలు అంటూ కాలాన్ని నెట్టుకు రావడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఐటీ దాడులు, ఈడీ విచారణలు, రంగంలోకి ఢిల్లీ పోలీసులు, సీబీఐ ఇలా, అన్నీ కేంద్రం బెదిరింపుల వ్యవహారాల్లో భాగమేనని పేర్కొన్నారు. అయితే, స్టాలిన్‌ వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ ఖండించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అధికారం చేజిక్కంచుకోవడం లక్ష్యంగా స్టాలిన్‌ కుట్రలు చేస్తూ, నిందల్ని తమ మీద నెడుతున్నారని మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement