సాక్షి ప్రతినిధి, చెన్నై:కావేరీ నదీ జలాల విడుదలపై సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించిన కర్ణాటక ప్రభుత్వ వైఖరి తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేయాల్సిందిగా జయలలిత ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు, కావేరీ డెల్టా రైతులు ఒత్తిడి తెస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజల ఆందోళనకు తలొగ్గి నీటి విడుదలను నిలిపి వేసింది. దీంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 3400 ఘనపుటడుగులకు పడిపోయింది.
కావేరీ నీటి విడుదలను నిలిపివేయాలని శుక్రవారం నాటి కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయబోతోందని ప్రతిపక్షాలు అంచనావేస్తున్నాయి. కావేరీ జలాలపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 27వ తేదీన విచారణకు వచ్చినపుడు అసెంబ్లీ తీర్మానాన్ని అనుసరించి నీటిని విడుదల చేశామని కర్నాటక ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అనుమానిస్తున్నారు. కర్నాటక కుట్రను ఎదుర్కోవాలంటే తమిళనాడు ముఖ్యమంత్రి సైతం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడులోని రాజకీయ పార్టీల బలాన్ని కేంద్రానికి తెలిపేలా అఖిలపక్షసమావేశాన్ని ఏర్పాటు చేయాలని తమాకా అధ్యక్షులు జీకే వాసన్ కోరుతున్నారు. కావేరీ నదీజలాల హక్కును కాపాడుకునేందుకు త్వరలో ఇతర పార్టీలతో కలిసి సంయుక్త పోరాటానికి దిగుతున్నట్లు వీసీకే అధినేత తిరుమావళవన్ గురువారం ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పును అవమానించిన కర్నాటక ప్రభుత్వంపై అత్యవసర కేసును దాఖలు చేయాలని తమిళనాడు వ్యవసాయదారుల సంఘం సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు పీఆర్ పాండియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుచ్చిరాపల్లిలోని రైతులు కావేరీ నది నడుములోతు నీళ్లలోకి దిగి గురువారం నిరసన పోరాటం సాగించారు.
కర్ణాటకపై ఫైర్
Published Fri, Sep 23 2016 2:22 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement