చిన్నచిత్రాలకే అవార్డుల పంట
చిన్నచిత్రాలకే అవార్డుల పంట
Published Sat, Jul 15 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
- అవార్డులకు నోచుకోని స్టార్స్
తమిళనాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ చిత్రాలను, కళాకారులను ఎంపిక చేసి అవార్డులతో ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను నిర్వహించడం లేదు. ఇలాంటి పరిíస్థితుల్లో గురువారం ఓకేసారి 2009 నుంచి 2014 ఏడాది వరకూ సినీ అవార్డులను ప్రభుత్వం ప్రకటించడం విశేషం. కాగా ఈ ఆరేళ్లలోనూ ఉత్తమ అవార్డుల పట్టికలో చిన్న చిత్రాలే చోటు చేసుకోవడం, ప్రముఖ నటులకెవరికీ అవార్డులు దక్కకపోవడం గమనార్హం.
అయితే ఈ అవార్డులపై అసంతృప్తి అన్నది అక్కడక్కడా వినిపిస్తున్నా 90 శాతం సినీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిత్రాలు మైనా, వాగై చూడవా, వళక్కు ఎన్ 18/9, రామానుజన్, కుట్రం కడిదల్ వంటి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్న చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం హర్షణీయం. ఇక 2009 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా కరణ్, 2010 లో విక్రమ్, 2011 లో విమల్, 2012 లో జీవా, 2013 లో ఆర్య, 2014 లో సిద్ధార్థ్ వంటి యువ నటులు ఉత్తమ నటుడి అవార్డు అందుకోనున్నారు. ఆ పట్టికలో ప్రముఖ నటులకు చోటు దక్కక పోవడం వారి అభిమానులకు నిరాశ అవుతుంది.
రాజకీయ హస్తం ఉందా?
ఈ ఆరేళ్ల కాల వ్యవధిలో ప్రముఖ నటులు నటించిన పలు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. సాధారణంగా ఒక్క ప్రముఖ నటుడికైనా అవార్డు దక్కే అవకాశం ఉంటుందని, అలాంటిది ఈ సారి ఏ ఒక్క ప్రముఖ నటుడికీ అవార్డు రాకపోవడంతో రాజకీయ హస్తం ఉంటుందనే ప్రచారం వెలుగు చూస్తోంది. నటుడు రజనీకాంత్ అందరు రాజకీయ నాయకులతోనూ సన్నిహితంగా ఉంటున్నా, ఇటీవల ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ వ్యవస్థ సరిగా లేదని సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలాన్ని సృష్టించింది. అదే విధంగా నటుడు విజయ్ జల్లికట్టు విషయంలో ఆవేశంగా మాట్లాడిన వీడియోను విడుదల చేసి సంచలనాలకి కారణం అయ్యారు. ఇక నటుడు కమలహాసన్ ఇటీవల రాజకీయపరిణామాలపై ఘాటుగానే స్పందిస్తున్నారు.
ఇకపోతే 2015, 2016 సంవత్సరాలకు అవార్డులను వెల్లడించలేదు. అందుకు కారణాలేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథానాయికల పట్టికలో నయనతార, ఓవియ, ఐశ్వర్యరాజేశ్, అమలాపాల్, పద్మప్రియ, లక్ష్మీమీనన్ చోటు చేసుకున్నారు. దర్శకుల విషయానికొస్తే వసంతబాలన్, ప్రభుసాల్మన్, ఏఎల్.విజయ్, బాలాజీ శక్తివేల్, రామ్,రాఘవన్ అవార్డులకు ఎంపికయ్యారు. ఇంకా సంగీతదర్శకులు, గీతరయితలు అవార్డులకు ఎంపికైనవారిలో ఉన్నారు.
Advertisement
Advertisement