మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం | tdp leaders attack on sakshi reporters | Sakshi
Sakshi News home page

మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం

Published Tue, Oct 18 2016 8:32 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం - Sakshi

మద్యం తాగి పచ్చతమ్ముళ్ల వీరంగం

  •  నలుగురు రైతులపై దాడి
  •  సీఆర్‌డీఏ కార్యాలయంలో ‘సాక్షి’ బృందాన్ని నిర్బంధించిన తమ్ముళ్లు
  •  ఏ ఆధారాలతో వార్తలిచ్చారో చూపించాలంటూ దౌర్జన్యం
  •  పక్కా రికార్డులు చూపించడంతో సీఆర్‌డీఏపైకి నెట్టేసిన వైనం

  • సాక్షి, అమరావతి బ్యూరో: అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు పచ్చ తమ్ముళ్లు కొందరు దౌర్జన్యానికి దిగారు. మద్యం సేవించి మరీ ఏపీ రాజధాని పరిధిలోని అనంతవరం గ్రామానికి చెందిన నలుగురు రైతులపై దాడికి తెగబడ్డారు. రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లిన సాక్షి బృందాన్ని స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్బంధించారు. ఏ ఆధారాలతో వార్తలు రాశారో చూపించనిదే ఇక్కడి నుంచి వెళ్లడానికి లేదని అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధులు తమ వద్ద ఉన్న పక్కా రికార్డులను తెచ్చి చూపించడంతో చేసిన తప్పును సీఆర్‌డీఏ అధికారులపై నెట్టేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, టీడీపీలోని మరో వర్గం 'సాక్షి'కి అండగా నిలిచింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్రమార్కులు పత్తాలేకుండా పోయారు. దాడిలో గాయాలపాలైన గురజాల రామ్మోహన్‌రావు.. టీడీపీ నేత పారా కిషోర్‌పై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారా కిషోర్‌పై 506, 509, 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    రాజధాని రైతుల భూములను ఆక్రమించుకుని రికార్డులు తారుమారుచేసిన వైనంపై 'సాక్షి' పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. అక్రమాలు వెలుగులోకి రావటంతో ఉలిక్కిపడ్డ స్థానిక టీడీపీ నేతలు, కొందరు సీఆర్‌డీఏ అధికారులు తారుమారు చేసిన రికార్డులను మళ్లీ మార్చేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఇద్దరి పేర్లు మార్చి పాత రికార్డులుగా సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ విషయం కూడా 'సాక్షి' బయటపెట్టడంతో ఇరకాటంలో పడిన టీడీపీ నేతలు.. రకరకాల ఫోన్ల నుంచి సాక్షి ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించే ప్రయత్నం చేశారు.

    అర్ధరాత్రి మద్యం తాగి రైతులపై దాడి
    భూములు మాయం చేసిన ఆధారాలు 'సాక్షి'కి ఎలా వచ్చాయని టీడీపీ నాయకులు విచారించారు. రైతులే 'సాక్షి'కి ఉప్పందిస్తున్నారని అనుమానం వచ్చిన వారిపై దాడిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక కొందరు మద్యం తాగి అనంతవరం గ్రామంలో దౌర్జన్యం చేశారు. గురజాల రామ్మోహన్‌రావు, తరిగోపుల నరసింహరావుపై దాడిచేసి గాయపరిచారు. మంగళవారం ఉదయం బండ్ల బసవయ్యపై దాడిచేశారు. సాక్షికి ఇంటర్వ్యూలు ఇచ్చిన రైతులు, సాక్షి ప్రతినిధులను కొట్టాలని పథకం వేశారు. అందుకు ఓ 40 మంది గ్రూపుగా ఏర్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలియడంతో సాక్షి బృందం మంగళవారం అనంతవరానికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న పచ్చనేతలు సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకొని.. అక్కడ ఉన్న రైతులను బయటకు పంపి సాక్షి బృందాన్ని కార్యాలయంలోకి పిలిచి నిర్బంధించారు. తమపై ఏ ఆధారాలతో కథనాలు రాశారో చూపించే వరకు కదలడానికి లేదని దౌర్జన్యం చేశారు.

    ఒకానొక సమయంలో సాక్షి బృందంపై దాడికి యత్నించారు. తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, తెప్పిస్తామని చెప్పడంతో కొంత సమయం ఓపిక పట్టారు. రికార్డులను తీసుకొచ్చి పచ్చనేతలకు చూపించటంతో అందులో భూములు ఎలా వచ్చాయో తమకు తెలియదని, అంతా సీఆర్‌డీఏ అధికారులు చేశారని బుకాయించారు. అయితే పత్రికలో చూపించిన భూమిని ఇవ్వాలని, లేకపోతే కౌలు చెల్లించాలని సాక్షి బృందాన్ని డిమాండ్ చేశారు. నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా తుళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. ఇక తమ ఆటలు సాగవని గ్రహించిన అక్రమార్కులు పోలీసులు గ్రామానికి చేరేలోపు పత్తాలేకుండా పోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement