రైతు సమస్యలు పట్టని కేసీఆర్...
టీడీపీ రైతు పోరు యాత్రలో రేవంత్‌రెడ్డి
సాక్షి, భూపాలపల్లి: వర్షాలు కురవడంతో రైతులు పొద్దున పొలం పనులు, రాత్రి దావత్‌లతో సంబరాలు చేసుకుంటున్నారంటూ సీఎం కేసీఆర్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నా రు.
ఆ పార్టీ చేపట్టిన రైతు పోరుయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. అనంతరం జరిగిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. మూడేళ్లలో 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టగలిగిన ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన రూ.800 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వకుండా సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేటాయించారని ఆరోపించారు. పీవీ సింధుకు రూ.4 కోట్లు, సానియా మిర్జాకు రూ.2 కోట్లు, కూతురు కవిత బతుకమ్మకు రూ.25 కోట్లు కేటాయించగా లేనిది.. రుణమాఫీ సొమ్ములు చెల్లిస్తే నష్టమేంటన్నారు. రేపు కవిత చంద్రమండలంలో బతుకమ్మ ఆడతానంటే రూ.150 కోట్లు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ధ్వజమెత్తారు.