ఇంత తక్కువ శిక్షా !
Published Sat, Aug 31 2013 11:00 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM
న్యూఢిల్లీ: ఫిజియోథెరపీ విద్యార్థిని ‘నిర్భయ’పై డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం చేసిన వారిలో ఒకడైన మైనర్ యువకుడికి కేవలం మూడేళ్ల శిక్ష విధించడంపై ఆమె కుటుంబ సభ్యులు అసంతృప్తి ప్రకటించారు. ‘బాలల న్యాయస్థానం (జేజేబీ) అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తుందని అనుకున్నాం. ప్రత్యేక వసతిగృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించాలంటూ వెలువడ్డ తీర్పు మాకు నిరాశ కలిగించింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి మూడేళ్ల తరువాత స్వేచ్ఛాజీవిగా మారిపోతాడు. ఈ తీర్పు నేరగాళ్లను ప్రోత్సహించేలా ఉంది. ఇలాంటి చట్టాలను మార్చాలి. ఈ నిర్ణయాన్ని మేం హైకోర్టులో సవాల్ చేస్తాం’ అని మృతురాలి తండ్రి అన్నారు. నిర్భయ తల్లి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తపరిచారు. అత్యాచారం సమయంలో 17.5 ఏళ్ల వయసున్న నిందితుడికి ప్రస్తుతం 18 ఏళ్లు నిండాయి.
ఇతడు ప్రత్యేక వసతిగృహంలో మూడేళ్లపాటు శిక్ష అనుభవించాలంటూ జేజేబీ న్యాయమూర్తి గీతాంజలి గోయల్ శనివారం తీర్పు ప్రకటించారు. డిసెంబర్ 16 రాత్రి నిందితులు మైనర్ యువకుడితోపాటు రామ్‌సింగ్, వినయ్, అక్షయ్, పవన్‌గుప్తా, ముకేశ్ ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 30న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ దాడిలో నిర్భయ స్నేహితుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశవిదేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
Advertisement
Advertisement