
చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి
సూర్యాపేట : దేశానికి స్వాతంత్య్రం ఎవరు తెచ్చారో చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ఒక్కరే స్వాతంత్య్రం కోసం పోరాడినట్లుగా మాట్లాడడంలో అర్థం లేదన్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారతదేశ చరిత్రను వక్రీకరించి బీజేపీ చరిత్ర రాయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తెలిపారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లు కలిసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని పేర్కొన్నారు. పటేల్.. నెహ్రూ కంటే గొప్ప వ్యక్తి అని.. నెహ్రూను కించపరిచే విధంగా మాట్లాడితే భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జైపాల్‌రెడ్డి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడని.. అమిత్‌షా కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన నాయకుడన్నారు. దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడే సమయంలో బీజేపీ లేదన్నారు. పటేల్.. కాంగ్రెస్‌లో ఏఐసీసీ అధ్యక్షుడిగా.. దేశ ఉప ప్రధాన మంత్రిగా కొనసాగారని తెలిపారు.
బీజేపీ మాత్రం పారిశ్రామికవేత్తల పక్షాన ఉందే తప్పా పేద ప్రజలపక్షాన లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేవలం సికింద్రాబాద్‌కే కేంద్ర మంత్రి అన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వరరావు, బైరు వెంకన్నగౌడ్, చెంచల శ్రీనివాస్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, ధరావత్ వీరన్న, అయూబ్‌ఖాన్, తూముల సురేష్‌రావు, బంటు చొక్కయ్యగౌడ్, చిలుముల సునీల్‌రెడ్డి, ఆలేటి మాణిక్యం, కక్కిరేణి శ్రీను పాల్గొన్నారు.