సరిహద్దుల్లో ఉద్రిక్తత
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యాం నీటి మట్టం పెంపును అడ్డుకునేందుకు కేరళ అల్లరి మూకలు యత్నించడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులపైనా, తమిళ గ్రామాల్లోని ప్రజలపైనా దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు రావడం మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటిమట్టం 142అడుగులకు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డ్యాం నీటి మట్టం పెంచకుండా అడ్డుకునేందుకు కేరళ సర్కారు కుట్రలు చేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నీటి మట్టం పెంచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డ్యాం గేట్లు బలహీనంగా ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో చోటకు తరలి వెళ్లాలని, నీటి మట్టాన్ని తగ్గించాలని గళం విప్పుతూ వచ్చిన కేరళ సర్కారు, తాజాగా అక్కడి అల్లరి మూకల్ని ఉసిగొల్పుతోంది.
దాడులు: నీటి మట్టం పెంపుపనుల్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులపై అక్కడి అల్లరి మూకలు దాడికి యత్నించినట్టుగా సోమవారం సమాచారం పాకింది. అలాగే, కేరళలోని తమిళ గ్రామాల మీద అల్లరి మూకలు తమ ప్రతాపం చూపించే పనిలో పడ్డట్టుగా వచ్చిన సమాచారం తేని సరిహద్దుల్లో కలకలం రేపింది. నీటి మట్టాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కారు అక్కడి ప్రజలను రెచ్చ గొడుతుండడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అవుతోంది. డ్యాం పరిసరాల్లో భద్రతా విధుల్లో ఉన్న కేరళ పోలీసులు తమిళ అధికారులకు, తమిళ ప్రజలకు సహకరించడం లేదన్న సంకేతాలతో ఆ డ్యాం నీటి ఆధారిత జిల్లాల్లో ఆగ్రహజ్వాల రాజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తక్షణం తమిళ పోలీసు బలగాల్ని ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో భద్రతా విధుల్లోకి దించాలని, లేని పక్షంలో డ్యాంకు ప్రమాదం కలిగించే విధంగా కేరళ వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు అన్నదాతులు గగ్గోలు పెడుతున్నారు. తమిళుల మీద, అధికారుల మీద దాడులు జరిగినా, డ్యాం నీటి మట్టం పెంపును అడ్డుకునే విధంగా వ్యవహరించినా, తీవ్ర పరిణామాల్ని చవి చూడాల్సి ఉంటుందని కేరళకు అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉద్రికత్త నెలకొనడంతో నీటి మట్టం పెంపు మరోమారు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య దాడులకు దారి తీసేనా అన్న ఉత్కంఠ బయలు దేరింది.