సుకన్య-మణికందన్
చెన్నై : తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యంలోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్ బుధవారం పండగ శోభను సంతరించుకుంది. సాధారణంగా ఆ చెక్‌పోస్ట్ ద్వారా నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య సరకు రవాణా జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ చెక్‌పోస్ట్ మూడు పెళ్లిళ్లకు వేదికగా మారింది. ఇలా మూడు పెళ్లిళ్లు ఒకే రోజు కొంత విరామంతో జరగడం విశేషం.
వేదక్కని-ముత్తప్పరాజ్
కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు, తమిళనాడుకు చెందిన ముగ్గురు అబ్బాయిలతో పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. అయితే అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ విధించడంతో వారు తొలుత వివాహలను వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడంతో పెద్దలు తమ పిల్లలు ఎలాగైనా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. వారి వారి తల్లిదండ్రులు ఇరు రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇలా ముగ్గురు వధూవరులు.. అధికారులు అనుమతితో, పెద్దల ఆశీర్వాదంతో బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద ఏకమయ్యారు. ఇందుకు వారి కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కస్తూరి-నిర్మల్‌రాజ్
దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుకన్య-మణికందన్, వేదక్కని-ముత్తప్పరాజ్, కస్తూరి-నిర్మల్‌రాజ్ జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని వారు ముందుగానే శానిటైజ్ చేసుకుని అక్కడికి తీసుకువచ్చారు. పెళ్లి తర్వాత నూతన వధువులు.. తమిళనాడులోకి తమ తమ అత్తవారి ఇళ్లకు చేరిన తర్వాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇదే చెక్‌పోస్ట్ వద్ద జూన్ 7వ తేదీన కూడా ఓ పెళ్లి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment