అలర్ట్
Published Mon, Jan 20 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు నిఘాను అప్రమత్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరగడం, అజ్ఞాత తీవ్రవాదులు పట్టుబడడంతో చాప కింద నీరులా సంఘ విద్రోహ శక్తులు కార్యకలాపాలు సాగిస్తున్నాయూ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి. మరో తీవ్రవాది అబుబక్కర్ సిద్ధిక్ జాడ ఇంత వరకు కానరాలేదు. విదేశాల నుంచి నకిలీ వీసాలతో, నకిలీ పాస్ పోర్టులతో చెన్నైకు వచ్చి పట్టుబడుతున్న వారి సంఖ్య, బ్లాక్ మనీ, బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల నేపాల్‌లో పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్ర వాది యాసిన్ భత్కల్ చెన్నైలో రెక్కీ నిర్వహించినట్టుగా గతంలో ప్రచారం సాగింది.
ఈ పరిస్థితుల్లో తాజాగా అదే తీవ్రవాది విడుదలకు డిమాండ్ చేస్తూ విమానాల హైజాక్‌కు ముష్కరులు కుట్ర చేసినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ కేంద్రం ఆదేశించింది. నిఘా నీడలో: రాష్ట్రంలోని చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం అతి పెద్దది. ఇటీవలే సరికొత్త హంగులతో ఈ విమానాశ్రయం రూపు రేఖల్ని మార్చారు. జాతీయ, అంతర్జాతీయ విమానాలకు వేదికగా ఉన్న ఇక్కడ భద్రత ఎప్పుడూ కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, కేంద్రం నుంచి ఏదేని హెచ్చరికలు వచ్చిన పక్షంలో మాత్రం నిఘాను మరింత పెంచుతుంటారు. ఆ దిశగా విమానాశ్రయం పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. అక్కడి నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. కేంద్ర ఆయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో నిమగ్నం అయ్యాయి. ప్రతి విమానాన్ని, ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలకు ఆంక్షలు విధించారు. తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. సందర్శకుల అనుమతికి ఈనెలాఖరు వరకు బ్రేక్ వేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.
Advertisement