హిందూనేతలపైనే
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలో మూడేళ్లుగా తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యూయి. ప్రముఖ హిందూ నేతలు ఎందరో వారి దాడులకు బలయ్యూరు. ఆయా కేసుల్లో కొందరు పట్టుబడి జైళ్లలో ఉండగా, మరి కొందరు అజ్ఞాతంలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బస్సు, రైలు, విమాన ప్రయాణాల కంటే రాష్ట్రం వెంబడి ఉన్న సముద్ర మార్గం సురక్షితమని తీవ్రవాదులు భావిస్తున్నారు. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తరచూ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేస్తున్నాయి. మత్స్యకార గ్రామాలపై పోలీసులు నిఘా పెడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఏమూల ఎక్కడ ఏమి జరుగుతుందోననే ఆందోళన పోలీసు యంత్రాంగాన్ని వెంటాడుతోంది.
ఈ దశలో అల్-ఉమాకు చెందిన ముగ్గురు మాజీ తీవ్రవాదులు రెండు రోజుల క్రితం చెన్నై పోలీసులకు పట్టుబడ్డారు. కాశీమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రమార్గంలో పరారయ్యేం దుకు ప్రయత్నిస్తున్న మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 18న తిరువళ్లూరు హిందూ మున్నని నేత సురేష్‌కుమార్‌ను హత్యచేసింది తామేనని పట్టుబడిన అంబత్తూరు పాడికి చెందిన నజీర్ (28), కడలూరుకు చెందిన ఖాజా మొహిద్దీన్ (32), కుతుబుద్దీన్ (30) అంగీకరించారు. అంతేగాక మరికొందరిపై తాము గురిపెట్టినట్లు వాంగ్మూలం ఇవ్వడం పోలీసులను కలవరపెట్టింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితులు గతంలో నగరంలోని దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తూ జీవించేవారు. వీరిని కొందరు తీవ్రవాదులు తీసుకెళ్లి బ్రెయిన్‌వాష్ చేసి తీవ్రవాదులుగా మార్చినట్లు విచారణలో తేలింది. తీవ్రవాదులుగా ఉంటే ఎక్కువ మొత్తం ముట్టుతుందనే ఆశను వారికి కల్పించారు.
హిందూ నేతల కదలికలు చేరవేస్తే చాలని అగ్రనేతలు వీరిని ఆదేశించారు. ఈ పథకం ప్రకారమే సురేష్‌కుమార్ హత్య జరిగింది. హత్యల వెనుక అసలు సూత్రధారి ఖాజామొహిద్దీన్ వంటి తీవ్రవాదులు ఇంతవరకు పట్టుబడలేదు. ఇంకా కొందరు హిందూ నేతలను హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలగా, అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదులు దొరికితేగానీ వారి చిట్టాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటికే తిరువళ్లూరులో హిందూ మున్నని నేత సురేష్‌కుమార్, సేలంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆడిటర్ రమేష్ హత్యకు గురయ్యూరు. వీరి హత్యల్లో ఇప్పటికే గతంలో ముగ్గురు, తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యూరు. అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల వల్ల ముప్పు ఏర్పడకుండా హిందూనేతలకు ఇప్పటికే ఉన్న పోలీసు బందోబస్తును మరింత పెంచారు.