హతమారుస్తాం
చెన్నై, సాక్షి ప్రతినిధి:తీవ్రవాదుల తాకిడితో రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ, హిందూ మున్నని నేతలు హడలిపోతుండగా తాజాగా మరో బెదిరింపులేఖ వారిని భయపెడుతోంది. రాష్ట్రానికి చెందిన హిందూ, బీజేపీ నేతలపై తీవ్రవాదులు గురిపెట్టి ఉన్నట్లుగా ఇటీవల ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వట్టి వదంతులేనని పోలీస్‌శాఖ తేలిగ్గా తీసిపారే సింది. అయితే తీవ్రవాదులు అన్నంత పనీ చేశారు. వేలూరు జిల్లా హిందూ మున్నని అధ్యక్షుడు వెల్లయప్పన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ (ఆడిటర్)ను గతేడాది హతమార్చారు. ఆ తరువాత కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
పోలీసులు మొక్కుబడిగా బాధితుల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. అంతే మరో ఘోరం జరిగిపోయింది. అంబత్తూరు వద్ద హిందూ మున్నని నేత సురేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయం సమీపంలోనే జూన్ 18వ తేదీన హత్యచేశారు. ఆయా కేసులో అల్-ఉమా తీవ్రవాదులు, ఇదే తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులు పట్టుపడ్డారు. ఈనెల 28న మధ్యాహ్నం చెన్నై చింతాద్రిపేటలోని హిందూ మున్నని కార్యాలయానికి బెదిరింపులేఖ అందింది. హిందూనేతలను హతమార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అందులో పేర్కొన్నారు. తంజావూరు, శివగంగై, కోయంబత్తూరు, విరుదునగర్, తిరుచ్చిరాపల్లి, తిరునెల్వేలి, చెన్నై నగరాల్లోని హిందూనేతలను హతమారుస్తామని ఆయా జిల్లాల్లోని ఒక అక్షరాన్ని ఆ లేఖలో కోడ్‌గా పొందుపరిచారు.
తమిళభాషలో రాసిన ఆ లేఖ చివరన ఇట్లు ఇమామలై సోదరులు అంటూ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడు నుంచి ఆ లేఖ వచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ ఉత్తరాన్ని అందుకున్న నేతలు ఆందోళన చెందారు. హిందూ మున్నని నేతలు మనోహరన్, పరమేశ్వరన్, మురుగేశన్, ఇళంగోవన్, కృష్ణమూర్తి మంగళవారం నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరిచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో హిందూ మున్నని కార్యాలయానికి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.