గొడ్డు మాంసం తినడం పౌరుల ప్రాథమిక హక్కు కాదని మంగళవారం హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
గోవధ నిషేధంపై కోర్టులో ప్రభుత్వ వాదన
ముంబై : గొడ్డు మాంసం తినడం పౌరుల ప్రాథమిక హక్కు కాదని మంగళవారం హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జంతువుల మాంసం వినియోగాన్ని రాష్ట్ర చట్టసభలు నియంత్రించవచ్చని చెప్పింది. ఈ మేరకు అడ్వొకేట్ జనరల్ సునీల్ మనోహర్ కోర్టుకు విన్నవించారు. బీఫ్ మాంసం రద్దును వ్యతిరేకిస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ‘మనిషి మాంసం కాకుండా ఏ జంతువు మాంసాన్ని అయినా తినొచ్చు’ అనేలా వ్యవహరిస్తున్న పిటిషనర్ల తీరును సునీల్ తప్పు పట్టారు. ఏ జంతువు మాంసం వినియోగాన్నయినా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
రాష్ట్ర జంతు సంరక్షణ చట్టం ప్రకారం అడవి పంది, జింక, ఇతర జంతువుల మాంసాన్ని వినియోగించకూడద న్నారు. అయితే, పక్క రాష్ట్రాల్లో జంతు వధ నిషేధం కొనసాగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. మాంసంపై నిషేధం విధిస్తూ ఇష్టమైన ఆహారం తినే వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నారని సీనియర్ న్యాయవాది చినోయ్ వాదించారు. బీఫ్ ద్వారా వచ్చే పౌష్టిక ఆహారం ఇతర పదార్థాల ద్వారా కూడా తీసుకోవచ్చని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జంతు సంరక్షణ చట్టాన్ని పేపర్‌కు పరిమితం చేయొద్దని కోరారు. వీఎమ్ కనడే, ఎమ్‌ఎస్ సోనాక్‌లతో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.