దేశ వైమానిక రంగం అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక సహకారం అధికమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
బెంగళూరు : దేశ వైమానిక రంగం అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక సహకారం అధికమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దేశ విమానయాన రంగానికి అవసరమైన వస్తు ఉత్పత్తి కర్ణాటక నుంచే 60 శాతం ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో బుధవారం ఏరో ఇండియా-15 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... దేశంలో తొలిసారిగా ఏరరో స్పేస్ పాలసీను అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రం కర్ణాటకనే అని తెలిపారు. ఈ విధానం 2023 వరకూ అమల్లో ఉంటుందన్నారు. ఈ విధానం వల్లనే విమాన యాన రంగంలో ఎక్కువ పెట్టుబడులు కర్ణాటకకే వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తుమకూరు వద్ద 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేశామన్నారు.
ఇక్కడ హెలిక్యాప్టర్ల తయారీ కోసం హెచ్‌సీఎల్ ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అదేవిధంగా వేమగల్, గౌరిబిదనూరు, దబస్‌పేట, మహ్మిగట్టి, గమన్‌హట్టి వద్ద కూడా ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటుచేశామన్నారు. దేశంలో మొదటిసారిగా ఏరోస్పేస్ సెజ్‌ను బెళగావి వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. విమానయాన రంగంలోని పలు ప్రైవేటు కంపెనీలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.. విమానయానరంగంతో పాటు ఐటీ,బీటీ రంగాల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. ఔత్సాహిక పెట్టుబడుదారులకు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిత్రదుర్గా-బెంగళూరు-చెన్నై... బెంగళూరు-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.