రాష్ట్రవ్యాప్తంగా 1.73 లక్షల విద్యార్థులు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 17,32,898 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 9,59,450 మంది బాలురు, 7,73,448 మంది బాలికలు ఉన్నారు. పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్, ముంబై, కొల్హాపూర్, అమరావతి, నాసిక్, లాతూర్, కొంకణ్ విభాగాల ఆధ్వర్యంలో 4,222 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంబై జోన్‌లో మొత్తం 3,82,437 మంది, పింప్రి-చించ్‌వడ్‌లోని 30 పరీక్ష కేంద్రాలలో 23,569 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం మొదటి భాషకు సంబంధించి తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళంతోపాటు ఇతర భాషల పరీక్షలు జరిగాయి. ద్వితీయ, తృతీయ భాషల పరీక్ష మధ్యాహ్నం జరిగింది. మహారాష్ట్ర సెకండరీ, హయ్యర్ సెకండరీ బోర్డు ఆదేశాల మేరకు పది నిమిషాల ముందే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందించారు.
తగ్గుతున్న తెలుగు మీడియం విద్యార్థులు..!
తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాదీ తగ్గుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మీడియం పాఠశాలలు తక్కువగానే ఉన్నా తెలుగును సబ్జెక్ట్‌గా తీసుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువే. అయితే ప్రతి ఏడాదీ వీరి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ముంబై తూర్పు బోరివలిలోని చైతన్య తెలుగు హైస్కూల్ , పశ్చిమ ములూండ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో పూర్తిగా తెలుగు మీడియంలో బోధిస్తున్నారు. చైతన్య పాఠశాలలో గతేడాది 250 మంది పరీక్ష రాయగా, ఈ ఏడాది 225 మంది రాస్తున్నారు. ములూండ్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. ఆంధ్ర ఎడ్యుకేషన్ సోసైటీ స్కూల్ నుంచి ఈ సారి 341 మంది ఉండగా వీరిలో 130 మంది తెలుగు భాష ఎంచుకున్నవారున్నారు. అయితే గతేడాది 145 మంది తెలుగులో పరీక్ష రాశారని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి లలితా తెలిపారు.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
Published Wed, Mar 4 2015 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement