హంపి వర్సిటీకి ఉన్నత స్థానం
ఘనంగా హంపి కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం
హాజరైన గ వర్నర్ వాజుభాయి రూడాభాయి వాలా
ముగ్గురికి నాడోజ బిరుదు ప్రదానం
హొస్పేట : విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తలపించేలా అత్యంత సుందరంగా హంపి విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమని న్యూఢిల్లీకి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కవి హెచ్‌ఎస్ శివప్రకాష్ అన్నారు. ఆయన శుక్రవారం హంపి కన్నడ విశ్వవిద్యాలయంలోని నవరంగ బయలు మందిరంలో ఏర్పాటు చేసిన 23వ స్నాతకోత్సవాన్ని ప్రారంభించి, మాట్లాడారు. హంపి కన్నడ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. కన్నడ భాషాభివృద్ధి కోసం హంపి కన్నడ విశ్వవిద్యాలయం నిరంతరంగా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఆంగ్ల భాషపై వ్యామోహానికి లోనై మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వెనకటి రోజుల్లో కన్నా నేటి రోజుల్లో ఆంగ్ల భాషపై వ్యామోహం మరింతగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేని వారు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత ఉద్యోగాలు, అధిక సంపాదన పొందాలన్నా ఆంగ్ల భాష మాధ్యమంలో చదివిన వారికే ప్రాధాన్యత లభిస్తోందన్నారు.
సమాజంలో ఈ పద్ధతి మారాలన్నారు. అన్ని రంగాల్లో కన్నా విద్యారంగాన్నికి ప్రత్యేక స్థానం ఉందని విద్యారంగం మరింత అభివృద్ధి చెందాలన్నారు. కన్నడ భాషా సంస్కృతులను కాపాడే బాధ్యత ప్రతి కన్నడిగులపై ఉందన్నారు. హంపి కన్నడ విశ్వవిద్యాలయం ప్రాధ్యాపకులు మరెన్నో ఉత్తమ పరిశోధనలను చేపట్టి సమాజానికి ఉత్తమ గ్రంథాలను వెలుగులోకి తేవాలని కోరారు. అనంతరం రాష్ట్రంలోని కన్నడ సాహిత్య రంగంతోపాటు ఇతర రంగాలలో ఉత్తమ సేవలందించిన డాక్టర్ పీఎస్.శంకర్, ఎస్‌ఆర్.రామస్వామి, ప్రొఫెసర్ ఎంహెచ్ కృష్ణయ్యలకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయి రూఢా భాయి వాలా చేతులు మీదుగా విశ్వవిద్యాలయం గౌరవ నాడోజ బిరుదులను ప్రదానం చేశారు. అదే విధంగా విద్యార్థులకు డిలిట్, పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా హంపి కన్నడ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ హెచ్‌సీ బోరలింగయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్ పూణచ్చ తంబండ, సిండికేట్ సభ్యులు, ప్రాధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.