సాక్షి, ముంబై: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు రైల్వే సేఫ్టీ బోర్డు నుంచి ‘సేఫ్టీ సర్టిఫికెట్’ మే ఒకటో తేదీన లభించే అవకాశాలున్నాయి. దీంతో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అధికారులు 12 సార్లు ఇచ్చిన డెడ్‌లైన్లు వాయిదా పడ్డాయి.
దీంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరి స్థితి నెలకొంది. ఎట్టకేలకు మే ఒకటి మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రైల్వే సేఫ్టీ బోర్డు సిబ్బంది తనఖీలు నిర్వహించి సేఫ్టీ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. దీంతో మెట్రో సేవలకు ముహూర్తం పెట్టేందుకు మార్గం సుగమమైంది. గత ఐదేళ్లుగా వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య మెట్రో ప్రాజెక్టును ఎమ్మెమ్మార్డీయే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఓటీ పద్ధతిలో చేపట్టిన విషయం తెలిసిందే.
మొత్తం రూ.2,356 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పలుమార్లు డెడ్‌లైన్లు వాయిదా పడినప్పటికీ అంచనావ్యయం మాత్రం పెరగలేదు. ఈ మొత్తంలో రూ.512 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో 133 కోట్లు ఎమ్మెమ్మార్డీయే, రూ.354 కోట్లు రిలయన్స్, రూ.25 కోట్లు మరో సంస్థ వాటా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజె క్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్రాక్, ప్లాట్‌ఫారాలు, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పనులు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉంది.
రైల్వే సేఫ్టీ బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహించిన అనంతరం సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ప్రారంభించే రాజకీయ లేదా పదవిలో ఉన్న మంత్రులు, ఇతర ప్రముఖుల అపాయింట్‌మెంట్ తీసుకుని ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఇదిలాఉండగా ప్రస్తు తం సేవలు అందిస్తున్న, దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టిన మోనో రైలుకు ప్రజల నుంచి అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. మూడు నెలల కాల వ్యవధిలో ఎమ్మెమ్మార్డీయేకు రావల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సిద్ధమవుతోంది. ఈ రైలును ముంబైకర్లు ఎలా ఆదరిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలాఉండగా, ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైన ప్పటినుంచి వేర్వేరు చోట్ల మొత్తం ఏడు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోగా 17 మంది కూలీలు తీవ్రం గా గాయపడ్డారు.వారికి నష్టపరిహారం కింద రూ.49.8 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అంతేగాక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెమ్మార్డీయే సైతం రూ.46.50 లక్షలు జరి మానా కూడా చెల్లించాల్సి వచ్చింది.
చార్జీలపై తొలగని స్తబ్ధత
త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలులో ప్రయాణికులకు చార్జీలు ఎంతమేర నిర్ణయించాలనే అంశంపై ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాల తరువాత చార్జీలపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చార్జీల విషయంలో ప్రభుత్వం, రిలయన్స్ సంస్థ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రభుత్వం కనీస చార్జీలు రూ.9, గరిష్ట చార్జీలు రూ.24 చొప్పున వసూలు చేయాలని యోచిస్తోంది. కాని రిలయన్స్ సంస్థ కనీస చార్జీలు రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో కచ్చితంగా ఎంత మేర వసూలు చేయాలనే దానిపై ఇంతవరకు నిర్ణయం కాలేదు.
బెస్ట్ బస్ చార్జీల కంటే మెట్రోకు ఒకటిన్నర రేటు ఎక్కువ కేటాయించాలని ప్రభుత్వం యోచి స్తోంది. కాని ఇంత తక్కువ చార్జీలతో మెట్రోలాంటి అత్యంత ఖరీదైన రవాణా సాధనాల్లో సేవలు అం దించడం సాధ్యం కాదని రిలయన్స్ తేల్చి చెప్పింది. అందుకు కనీస చార్జీలు రూ.22, గరిష్ట చార్జీలు రూ.33 కేటాయించాల్సిందేనని ప్రతిపాదించింది. కాని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. బెస్ట్ సంస్థను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో బెస్ట్ బస్సుల్లో చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి.
దీన్ని నిలిపివేస్తే బెస్ట్ బస్సుల్లో కూడా చార్జీలు విపరీతంగా పెరుగుతాయని అభిప్రాయపడింది. కాగా మెట్రోకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లభించదు. దీంతో తక్కువ చార్జీలతో ఖరీ దైన మెట్రో సేవలు అందించడం సాధ్యం కాదని రిలయన్స్ సంస్థ వాదిస్తోంది. దీనిపై ఎన్నికల ఫలి తాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు.
మెట్రో ‘సేఫ్టీ’కి పచ్చజెండా..!
Published Sun, Apr 27 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement