దద్దరిల్లిన ఉద్యాననగరి
{పత్యర్థిపై తూటాల వర్షం కురిపించిన ఓ వర్గం
ఒకరి మృతి
అదుపులోకి తీసుకుంటుండగా కత్తితో దాడి చేసిన నిందితుల
హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు
ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు
తూటాలు దూసుకెళ్లి ఇద్దరు నిందితులకు గాయాలు
నిందితుల నుంచి దేశీయ తుపాకీ, తూటాలు, డ్రాగన్, బైకు, సెల్‌ఫోన్లు స్వాధీనం
తుపాకీ కాల్పుల మోతతో ఉద్యాన నగరి దద్దరిల్లింది. ఈ శబ్ధాలతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్ముంటూ గడిపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ వర్గానికి చెందిన వ్యకిత జరిపిన కాల్పుల్లో ప్రత్యర్థి వర్గం నాయకుడు హతమయ్యాడు. మరోవైపు కాల్పులకు తెగబడ్డ వర్గాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము మధ్య నగరంలో రెండు చోట్ల జరగిన కాల్పులతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. -సాక్షి, బెంగళూరు/బనశంకరి
బెంగళూరు/బనశంకరి:బెంగళూరులో సంఘ విద్రోహులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిపిన కాల్పుల్లో ఒక వర్గం నాయకుడు హతమయ్యాడు. కాల్పులకు తెగబడ్డ వర్గాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము మధ్య నగరంలో రెండు చోట్ల జరగిన కాల్పులతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘ విద్రోహచర్యలకు పాల్పడే హెగ్డేనగర్‌కు చెందిన పర్వేజ్ (45)కు అండదండలు అందించేందుకు స్థానికంగా ఉంటున్న ఇద్రీస్ ప్రతి నెల రూ.10 వేలు వసూలు చేసేవాడు. (సంఘవిద్రోహ పరిభాషలో ఇలా వసూలు చేసే సొమ్మును ‘హప్త’ అంటారు.) అయితే రెండు నెలల క్రితం ఇద్రీస్ హత్యకు గురైన తర్వాత అతని స్థానానికి వచ్చి షబ్బీర్ కూడా పర్వేజ్‌ను హప్తా కోరాడు. ఇందుకు పర్వేజ్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల ముందు తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని షబ్బీర్ మరోమారు డిమాండ్ చేయగా పర్వేజ్ ససేమిరా అన్నాడు. దీంతో పర్వేజ్‌పై కక్ష పెంచుకున్న షబ్బీర్ సమయం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలో రంజాన్ సందర్భంగా శివాజీనగర్‌లో జరగుతున్న ఇప్తార్‌కు పర్వేజ్ హాజరయ్యాడని తెలుసుకున్న షబ్బీర్ మంగళవారం రాత్రి మరో నలుగురు అనుచరులతో కలిసి మారణాయుదాలు, దేశీయ తుపాకులతో ఘటన స్థలానికి చేరుకున్నాడు. ఇఫ్తార్ అనంతరం ఓ టీ స్టాల్ వద్ద ఉన్న పర్వేజ్, అతని అనుచరులైన ఖాసీమ్, వాజీద్‌తో పిచ్చాపాటి మట్లాడుకుంటున్నాడు. అక్కడే ఉన్న షబ్బీర్ మరోసారి డబ్బులు డిమాండ్ చేయగా ఫర్వేజ్ అంగీకరించలేదు.
దీంతో తన అనుచరులతో కలిసి పర్వేజ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పర్వేజ్ పొట్ట, తొడ భాగంలోకి తూటాలు దూసుకుపోయాయి. ఈ ఘటనలో ఖాసీమ్, వాజీద్‌లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బౌరింగ్ ఆసుపత్రికి చేర్చారు. అయితే పర్వేజ్ మార్గం మధ్యలోనే చనిపోగా ఖాసీమ్, వాజీద్‌లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
నిందితులకూ తూటా దెబ్బలు
సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు నగరంలో పలు చోట్ల నాకాబంది నిర్వహించి అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని, వ్యక్తిని తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజాము 3 గంగటల సమయంలో తన అనుచరుడైన భర్కత్‌తో కలిసి వెలుతున్న షబ్బీర్.. హెచ్‌బీఆర్ లేఅవుట్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న కే.జీ హళ్లి స్టేషన్ పోలీసులకు తారసపడ్డారు. తనిఖీలో భాగంగా వారిని ప్రశ్నించడానికి సిద్ధమైన హెడ్‌కానిస్టేబుల్ పద్మనాభ, కానిస్టేబుల్ శాజు ఆంథోనిలను నిందితులిద్దరూ తుపాకీతో బెదిరించారు. దీంతో పద్మనాభ... షబ్బీర్‌ను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డ్రాగర్‌తో షబ్బీర్ పద్మనాభ పై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న సీఐ శ్రీనివాస్ అప్రమత్తమై షబ్బీర్, భర్కత్ కాళ్ల పై కాల్పులు జరిపారు. దీంతో నిందితులిద్దరూ సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ పద్మనాభతో పాటు నిందితులిద్దరినీ బౌరింగ్ ఆసుపత్రిలో చేర్పించారు. ముగ్గురూ ప్రస్తుతం కోలుకుంటున్నారు.అదనపు కమిషనర్ హరిశేఖరన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ పర్వేజ్ పై దాడికి పాల్పడిన ఐదు మందిలో ఇప్పటికే ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలిసిందని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఇక నిందితుల నుంచి దేశీయ తుపాకి, తూటాలు, డ్రాగన్, బైకు, మూడు ముబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హరిశేఖరన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పర్వేజ్ పై దాడికి ముందు నిందితులు ఐదు మంది సిద్దాపురలో నివాసముంటున్న సినిమా డెరైక్టర్ మాహిన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి బెదిరించారు. అనంతరం ఆడుగోడి వెళ్లి నూర్ అనే వ్యక్తి తలపై మరణాయుధంతో దాడిచేశారు. ఈ రెండు ఘటనలపై వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.