కనిష్ట పరిహారం రూ.4,500 | The minimum compensation of Rs 4,500 | Sakshi
Sakshi News home page

కనిష్ట పరిహారం రూ.4,500

Published Thu, Dec 4 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

కనిష్ట పరిహారం  రూ.4,500

కనిష్ట పరిహారం రూ.4,500

క్వింటాల్ మొక్కజొన్నకు ఈ ఏడాది రూ.1,310 చెల్లింపు
రెండో వారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం
పీపీపీ విధానంలో అద్దెకు వ్యవసాయ పనిముట్లు
మూడేళ్లలోపు రైతులందరికీ ‘సాయిల్ హెల్త్ కార్డ్’
ప్రకృత్తి విపత్తులతో తగ్గిన పంట ఉత్పాదక లక్ష్యం
 మంత్రి కృష్ణభైరేగౌడ

 
 బెంగళూరు : అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ ఏడాది హెక్టారుకు కనిష్టంగా రూ.4,500 పరిహారంగా (వర్షాధారిత పంటలు) ఇస్తామని రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి కొన్నింటికి రూ.9 వేలు, మరికొన్ని పంటలకు రూ.12 వేలను కనిష్ట మొత్తాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామన్నారు. వికాస సౌధాలో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.1,310 చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు.  ఈ ప్రక్రియను ఈనెల రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించడంలో భాగంగా రైతులకు అవసరమైన పనిముట్లను అద్దెకు ఇచ్చే ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామన్నారు.  ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో 186 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో వ్యవసాయ పనిముట్లు ఉంటాయని, అద్దె, పరికరాల ఎంపిక తదితర విషయాల్లో జిల్లా పంచాయితీ సీఈఓ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిర్ణయమే అంతిమమని అన్నారు. ఈ కేంద్రాలకు రెండేళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. పంట ఉత్పాదక సామార్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా పొలాల్లోని మృత్తికకు (మట్టి రకానికి) అనుగుణంగా పంటలు వేయాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం ప్రతి రైతుకూ సాయిల్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామన్నారు. ప్రైవేటు సంస్థల సహకారంతో మూడేళ్లల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.80 కోట్ల కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు  తెలిపారు. రు.1,700 కోట్ల నాబార్డ్ నిధులతో దాదాపు పది లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక గోదాములను ఏడాదిన్నరలోపు  నిర్మించనున్నామని తెలిపారు. మొదటిదశలో ఐదు లక్షలటన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు అనువుగా రూపొందించిన ‘కృషిభాగ్య’ పథకానికి కనిష్టం రెండెకరాల పొలం ఉన్న రైతులు అర్హులని తెలిపారు. వీరు నీటి నిల్వకు అనుగుణంగా పొలంలో గుంతలు తవ్వడం దానిపై పాలిథీన్‌ను పరచడంతోపాటు సాగులో స్ప్రింక్‌లర్, డ్రిప్‌తోపాటు ‘పాలిహౌస్’ విధానాలు అవలంభిస్తే రూ.2 లక్షల వరకూ ప్రభుత్వం ధనసాయం అందిస్తుందన్నారు.

మొత్తం ఖర్చులో ఈ మొత్తం దాదాపు 60 శాతం వరకూ ఉంటుందని మంత్రి  వివరించారు. ఈ ఏడాది 135 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించుకున్నా రాష్ట్రంలో ఏర్పడిన అతివృష్టి - అనావృష్టి వల్ల 128 లక్షల టన్నులకు పరిమితం కావాల్సి వస్తుందని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. దీని వల్ల రాష్ట్రంలో అమలవుతున్న అన్నభాగ్యతోపాటు ఆహారభద్రత కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగవని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement