* ఇరు వర్గాల మధ్య ఘర్షణ
* ఏడుగురికి గాయాలు, ఒక బైక్ ధ్వంసం
* 50 మందిపై కేసు నమోదు
సాక్షి, ముంబై: సెంట్రల్ ముంబైలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఏడుగురు గాయపడగా, ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. చట్ట వ్యతిరేకంగా గుమికూడడం, అల్లర్లకు పాల్పడడం అభియోగాలపై పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. లాల్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మత ప్రదర్శనలో పాల్గొని తిరిగి వెళుతున్న వారిపై మరో వర్గం వారు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారినట్టు మత ఘర్షణనలకు దారితీసింది. దీంతో లాల్‌బాగ్, భారత్ మాత, బైకలా, పరేల్ తదితర ప్రాంతాల్లో పరిస్ధితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అనేక మంది స్థానికులు రోడ్డుపైకి వచ్చారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అసాంఘిక దుష్టశక్తులు రాళ్లు రువ్వి శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లజేశారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పక ముందే పోలీసులు, ఇతర దళాలను రంగంలోకి దింపినట్లు నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం ఈద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే కొందరు మైనార్టీ యువకులు ఆదివారం రాత్రి బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. దీంతో నగర రహదారులపై ట్రాఫిక్ జాం ఏర్పడింది.భారత్‌మాతా జంక్షన్ వద్ద బైక్‌లపై ముగ్గురేసి యువకులు ప్రయాణిస్తుండగా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ స్థానికులు కొందరు అక్కడున్న పోలీసులను ప్రశ్నించారని భోయివాడ పోలీస్‌స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సునీల్ తోండ్వాల్కర్ చెప్పారు.
ఈ ఘటన బైక్‌పై ఉన్న యువకులకు, పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదానికి దారి తీసిందన్నారు. ఆ తరువాత పరిస్థితి అదుపు తప్పి రెండు గ్రూపుల వారు పరస్పరం చేయి చేయి చేసుకున్నారని చెప్పారు. దీంతో మరిన్ని పోలీసు బలగాలను అక్కడికి రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారని, సెంట్రల్ రైల్వే వర్క్‌షాప్ వద్ద ఒక మోటార్‌సైకిల్ ధ్వంసమైందని కమిషనర్ రాకేశ్ మారియా చెప్పారు.
ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో కొందరు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. కానీ పోలీసులు వెంటనే బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించగలిగారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి వర్లీలో కొందరు రాస్తారోకో చేపట్టారు. దీంతో అక్కడ కూడా వాతావరణం వేడెక్కడంతో పోలీసులను మోహరించారు. మొత్తానికి సోమవారం రెండున్నర గంటల సమయానికి ప్రశాంతత నెలకొంది.
అర్థరాత్రి వరకు రాకేశ్ మారియా లాల్‌బాగ్ ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారు. ఎప్పకప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. సోమవారం కూడా శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయని మారియా అన్నారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాంబేకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని చెప్పారు.
సెంట్రల్ ముంబైలో ఉద్రిక్తత
Published Mon, Jan 5 2015 10:57 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement