చిన్నారిని కిడ్నాప్ చేసిన యువకుడి అరెస్టు
Published Wed, Aug 28 2013 3:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : చిన్నారికి చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబేడులో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన జరిగింది. చెన్నై, కోయంబేడు సౌత్ మాడ వీధికి చెందిన శేఖర్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి కుమార్తె నందిని (8), కుమారుడు ముఖేష్ (5) ఉన్నారు. వీరిద్దరూ చిన్మయా నగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం సాయంత్రం పాఠశాల పూర్తి అయిన తరువాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఇంటికి సమీపంలో ఉన్న సీమాత్తమ్మాల్ నగర్‌లో శేఖర్ తమ్ముడు పద్మనాభన్ ఇల్లు ఉంది. తరచూ నందినికి ముఖేష్ అక్కడికి వెళ్లి వస్తుంటారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముఖేష్ చిన్నాన్న ఇంటికి ఒంటరిగా నడిచి వెళ్లాడు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక యువకుడు చిన్నారి ముఖేష్‌కు చాక్లెట్ ఇచ్చాడు. తరువాత చిన్నారిని ఎత్తుకుని అక్కడి నుంచి పరుగెత్తాడు. ఆ సమయంలో చిన్నారి కేకలు వేయడంలో స్థానికులు వెంబడించి యువకుడిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. చిన్నారిని విడిపించి కోయంబేడు పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన దుండగుడు తాంబరం ముత్తు మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన దామోదరన్ (22)గా గుర్తించారు. అతను అన్నానగర్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. తగిన ఆదాయం లేకపోవడంతో చిన్నారిని కిడ్నాప్ చేసి బిక్షం ఎత్తుకునేందుకు పథకం వేసినట్టు పోలీసుల విచారణలో తెలిపారు. గతంలో కూడా ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. దామోదరన్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement