రాయచూరు రూరల్ : నిజాంల దాష్టీకాలనుంచి హైదరాబాద్( హై-క)కు విముక్తి కలిగి ఆరు దశాబ్దాలు దాటినా అభివృద్ధి ఎండమావిగానే ఉంది. ఇప్పటికీ కనీస సదుపాయాలులేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కర్ణాటకలో ముంబై-కర్ణాటక, మైసూరు-కర్ణాటక, హైదరాబాద్-కర్ణాటకగా మూడు ప్రాంతాలుండగా హైక అన్నింటా వెనకబడి ఉంది. హైదరాబాద్ ప్రాంతపు నిజాం పాలనలో 1724లో అసబ్ జహా వంశానికి చెందిన కమురుద్దీన్ ఆధీనంలో కన్నడ మాట్లాడే బీదర్, గుల్బర్గా, రాయచూరు, కొప్పళ, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, నాందేడ్, పర్భిణి, బీడ్, ఔరంగాబాద్, ఆంధ్రలోని 8 జిల్లాలు ఉండేవి.
దేశానికి స్వాతంత్రం లభించిన అనంతరం నిజాం పాలకుల నిరంకుశ పాలనకు చరమ గీతం పాడేందుకు ఉద్యమం ఆరంభమైంది. హై-క ప్రాంతంలో 1942లో పండిత్ తారానాథ్, డాక్టర్ బీజీ.దేశ్‌పాండే, గాణదాళ నారాయణప్పల నేతృత్వంలో సత్యాగ్రహం చేపట్టారు. రాయచూరు జిల్లాకు చెందిన అడవిరావు, జి.హనుమంతరావు, జోషి, కె.పాండురంగారావు, ఎం.నాగప్ప, బెట్టదూరు శంకరగౌడ, సదాశివరాజ్ పురోహిత్, గంగణ్ణగారి నాగణ్ణ, పండిట్ మాణిక్యరావులు ఆందోళన చేపట్టి నిజాంల నుంచి విముక్తి కల్పించాలంటూ 1947 ఆగస్టు 7న రామచూరులో ఆందోళన చేపట్టగా ప్రభుత్వం అరెస్టు చేసింది.
1947 అక్టోబర్ 2న వందల మంది విద్యార్థులతో స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో జిల్లాధికారిని కలిసేందుకు వెళ్లిన వారిని కూడా అరెస్ట్ చేశారు. ఎం.నాగప్ప, వీరణ్ణ, బసవరాజ్‌స్వామి తదితరులు 1948 సెప్టెంబర్ 13న పోలీసుస్టేషన్లపై దాడులు చేశారు. దీంతో మేజర్ జనరల్ బి.ఎస్.బ్రా, జనరల్ చౌదరి, ఎ.ఎ.రుద్ర, బిగ్రేడియర్ శోయ దత్తసింగ్ తమ సైన్యాన్ని హైదరాబాద్‌లో నిజాంలకు అప్పగించారు. సెప్టెంబరు 17న హైదరాబాద్ ప్రాంతంగా ఏర్పాటైంది.
అభివృద్ధి ఒట్టిమాట : హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఏర్పాటైనప్పటినుంచి ఈ ప్రాంతంలోని బీదర్, గుల్బర్గా, రాయచూరు, కొప్పళ జిల్లాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలతోపాటు రహదారులు,తాగునీరు తదితర మౌలిక వసతులు కూడా అంతంతమాత్రమే. నిధుల కేటాయింపులోనూ వివక్షే. భాష, ప్రాంతాల రచన అనంతరం రాష్ట్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, కొప్పళ గుల్బర్గా విభాగానికి, ధార్వాడ, బీజాపుర,
కార్వార, బెళగావి, గదగ్, హావేరి, బాగలకోట జిల్లాలు బెళగావి విభాగానికి, పాత మైసూరు ఒక విభాగంగా, బెంగుళూరు మరో విభాగంగా ఏర్పాటు చేశారు.
1996-97లో వైద్య రంగంలో బెంగుళూరు ప్రాంతంలో 650 మంది విద్యార్థులకు సీట్లు లభించగా హై-క భాగంలో 50 సీట్లు లభించాయి. మైసూరు, హాసన వంటి ప్రాంతాల్లో రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం యుద్ధప్రాతిదికన స్పందిస్తోంది. హై-కాలో వరదలు, కరవు నెలకొన్నా పట్టించుకునేవారు లేరు. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసినా అభివృద్ధి అంతంతమాత్రమే. హైస్కూళ్లు 500 మాత్రమే ఉండటంతో సాక్షరతా ప్రమాణం 8.5 శాతానికే పరిమితమైంది.రాయచూరు, బళ్లారి, గుల్బర్గా, బీదర్, కొప్పళ జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిపోతోంది.హైకాకు ఆర్టికల్-371 జారీ చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి పాలకులు చిత్తశుద్ధితో కృషిచేయడం లేదనే విమర్శలున్నాయి.
ఆరు దశాబ్దాలు గడిచినా... అభివృద్ధి శూన్యం
Published Wed, Sep 17 2014 4:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement