చావును గౌరవించరా?
చావును గౌరవించరా?
Published Tue, Jan 24 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
మైల పడుతుందన్న అద్దె ఇంటి యజమానులు
నడిరోడ్డుపై మృతదేహం
సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు
మైలంటూ.. మలినమంటూ.. నిర్జీవదేహాన్ని దరికి రానీయకుండా అద్దె ఇల్లు ఆచారాల గోడ కట్టగా.. చెత్త కుప్పలే బంధువులయ్యాయి.. ముళ్ల పొదలే ఆత్మీయులయ్యాయి.. శవాన్ని అక్కున చేర్చుకున్న మురుగు కాలువలు మనుషుల్లో మాయమైన మానవత్వాన్ని తమలో కలుపుకొని దూరంగా కదిలిపోయాయి. సొంత గూడు లేని నిరుపేద తండ్రి శవం.. మనుషులకు దూరంగా.. నగర శివారుకు దగ్గరగా.. అనాథగా పడి ఉండటాన్ని చూసి ఆ ఆడ బిడ్డ గుండెల్లో ద్రవించిన కన్నీటి పొర పాషాణ హృదయాలను తాకలేకపోయింది.. తాత అచేతన స్థితి వంక బేలగా చూస్తున్న పసిబిడ్డ చూపు జనన, మరణాల మాలిన్యమెక్కడంటూ తల్లి కన్నీటి చారికల సాక్షిగా మనిషిగా బతుకుతున్న మట్టిబొమ్మలను ప్రశ్నించింది.
తెనాలి/తెనాలి రూరల్ : ప్రాణం పోయిన శరీరాన్ని అంతిమ సంస్కారాల వరకు ఇంట్లో ఉండనిస్తే మైల పడుతుందన్న అద్దె ఇంటి యజమానుల విశ్వాసం ఇల్లు లేని ఎందరినో కడగండ్ల పాలు చేస్తోంది. అద్దెకు ఉండే ఇంట్లో ఎవరైనా ఆకస్మికంగా ప్రాణాలను కోల్పోతే, ఆ భౌతికకాయాన్ని వీధిలోనే ఉంచేయటం అనివార్యం. ప్రత్యామ్నాయం దొరక్కపోతే అట్నుంచి అటే శ్మశానస్థలానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ప్రాణప్రదమైన తమలో ఒకరు కాలంచేస్తే, ఏ దిక్కూ లేనట్టుగా అనాథ శవంగా రోడ్డుపై ఉంచాల్సిన నిస్సహాయతకు కుమిలిపోతుంటారు. తెనాలిలో జరిగిన ఘటన ఇందుకో నిదర్శనం.
మృతదేహంతోనే ఎదురుచూపులు...
పట్టణంలోని నందులపేటకు చెందిన మిండాల వెంకట్రావు (45) ముఠా కార్మికుడు. సిమెంటు దుకాణాలు, కొబ్బరిబొండాలు కొట్టేచోట.. ఏరోజు ఏ పని దొరికితే దానితోనే జీవనోపాధి. భార్య ఆదిలక్ష్మి. తను కూడా ఇంటిపనులతో భర్తకు ఆసరానిస్తోంది. కుమార్తెలు జ్యోతి, శాంతికి పెళ్లిళ్లు చేశారు. కలోగంజో తాగుతూ అద్దె ఇంట్లోనే హాయిగా సాగిపోతున్న కుటుంబమది. నాలుగు రోజుల క్రితం వెంకట్రావుకు ఆరోగ్య సమస్య ఎదురైంది. కామెర్ల వ్యాధిగా చెప్పారు. చేతిలో డబ్బుల్లేవు. తోటి కార్మికులే స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వెంకట్రావు, ఆదివారం రాత్రి ఆసుపత్రి నుంచి చెప్పాపెట్టకుండా వచ్చేశాడు. అక్కడి సిబ్బందికీ సమాచారం లేదు. సోమవారం ఉదయానికి బుర్రిపాలెం రోడ్డులోని జెండా చెట్టు దగ్గర్లో రోడ్డుపక్క పడి ఉన్నాడు. గుర్తించిన కొందరు.. భార్యాబిడ్డలకు సమాచారం అందించారు. కంగారుపడుతూ వచ్చిన ఆదిలక్ష్మి విగతజీవుడైన భర్తను చూసి భోరుమంది.
నడిరోడ్డుపై ఎదురుచూపులు...
మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, అద్దె ఇంటి యజమానులు అంగీకరించలేదు. దగ్గర్లో బంధువులు ఎవరూ లేరు. దీనితో శవాన్ని బుర్రిపాలెంరోడ్డు చివర పాలాద్రి కాలువ వద్దకు తరలించారు. రెండో కుమార్తె శాంతిని అక్కడుంచి, ఆదిలక్ష్మి స్వస్థలంలోని బంధువులకు కబురు పంపేందుకు వెళ్లింది. తండ్రి మృతదేహం వద్ద ఎండలోనే బిడ్డతో సహా శాంతి కూర్చుండిపోయింది. ఏడుస్తున్న బిడ్డకు ఇడ్లీ ముక్కతో ఆకలి తీర్చింది. దారంట వెళుతున్న ఎందరో ఈ దృశ్యం చూసి విచారం వ్యక్తం చేశారు. సాయంత్రానికి స్థానికులే ఆటో మాట్లాడి వెంకట్రావు మృతదేహాన్ని స్వగ్రామమైన పొన్నూరు దగ్గర్లోని నండూరుకు తరలించారు.
’మనిషి శవం ఇంట్లో ఉంచితే మైల పడటం ఏమిటి? నిత్యం వేలు, లక్షల శవాలను తన గర్భంలో దాచుకుంటున్న భూమి ఎంత మైలపడాలి? అలాంటపుడు భూమిపై ఎందుకు ఉంటున్నాం? మైల పడటం అన్న మాటే తప్పు’ అంటూ ’మీ ఇల్లెక్కడ’ నాటకంలోని ఓ పాత్ర చేసిన హితబోధ.. మన సమాజానికి ఎప్పటికి ఎక్కుతుందో?
Advertisement
Advertisement