బైక్ రేసింగ్‌పై కొరడా
సాక్షి, చెన్నై:నగరంలో కుర్రకారు సాయంకాల వేళ బైక్‌లపై చెక్కర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది, పదో తరగతి విద్యార్థులు సైతం తమ వాళ్ల బైక్ లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. కళాశాలల విద్యార్థుల ఆకతాయితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో వరుస ఘటనలు పోలీసుల్ని, అటు విద్యార్థుల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులు స్కూళ్లకు మోటార్ సైకిళ్ల మీద వస్తే అనుమతించొద్దంటూ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
కళాశాల విద్యార్థులు లెసైన్సులు కలిగి ఉంటే సరి, లేకుంటే అనుమతించొద్దన్న హెచ్చరికను జారీ చేసింది. విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డ పక్షంలో అందుకు ఆయా విద్యాసంస్థలే బాధ్యులవుతాయం టూ హెచ్చరికలు జారీ చేసింది. అయినా, ఈ హెచ్చరికలను పట్టించుకునే వాళ్లుంటే కదా! విద్యా సంస్థలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు బైక్ జోరులో హుషారుగా ముందుకు సాగుతున్నారు. యువత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది.బైక్ రేసింగ్ : కొన్ని చోట్ల కుర్రకారు బైక్ రేసింగ్‌ల పేరిట పందాలు కాసుకుంటూ రోడ్డు మీద దూసుకెళ్తున్నారు.
రోడ్డు మీద ఇతర వాహనాలు సైతం ప్రమాదానికి గురయ్యే విధంగా వీరి వీరంగాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఉదయం, రాత్రుల్లో మెరీనా తీరం, కామరాజర్ సాలై, శాంతోమ్ రోడ్డు, అడయార్, తిరువాన్మీయూర్, ఓఎంఆర్, ఈసీఆర్ రోడ్డు, తాంబరం, వండలూరు - కేలంబాక్కం మార్గాల్లో జోరుగా ఈ రేసింగ్ సాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు రేసింగ్ వ్యవహారం బయటకు వస్తుండగా, మిగిలిన సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా పందాలు కాసుకుంటూ దూసుకెళుతున్నారు. రెండు రోజుల క్రితం బైక్ రైసింగ్ ఓ విద్యార్థిని బలిగొన్న ఘటనతో నగర పోలీసు యంత్రాంగం మేల్కొంది. ఇక బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది.
నాన్ బెయిలబుల్ కేసులు: బైక్ రేసింగ్‌లకు క ళ్లెం వేయ డం, విద్యార్థులు, యువత బైక్ జోరుకు బ్రేక్‌లు వేయడం లక్ష్యంగా చర్యలకు నగర పోలీసు యంత్రాం గం నిర్ణయించింది. కమిషనర్ జార్జ్ ఇందుకు సంబంధించి అధికారులతో సోమవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట బైక్ రేసింగ్‌లో చిక్కేవారిని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్టు చేయాలన్నారు. ఆదేశాలను నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు జారీ అయ్యాయి. బైక్ రేసింగ్‌ల్లో చిక్కే వాళ్లపై ఎలాంటి జరిమానాలు విధించొద్దని, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద తొలుత కేసులు నమోదు చేసి, బైక్‌లను స్వాధీనం చేసుకోవాలని, విద్యార్థి అయినా సరే ముందు అరెస్టు చేయాలన్న ఆదేశాలు ఇస్తూ బైక్ రేసింగ్‌పై కొరడా ఝుళి పించేందుకు రెడీ అయ్యారు. విద్యార్థులు, 18 ఏళ్లలోపు వారు మోటార్ సైకిళ్లను గానీ, కార్లనుగానీ నడుపుతూ పట్టుబడిన పక్షంలో తొలిసారిగా జరిమానాలు భారీగానే మోగించేందుకు సిద్ధం అయ్యారు. మళ్లీ పట్టుబడితే మాత్రం ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు దిశగా హెచ్చరికలు జారీ కావడం గమనార్హం.