
అన్నాడీఎంకే ప్రభుత్వ పతనం తప్పదు
► ఎంకే స్టాలిన్
► పుదుక్కోట్టైలో ఆందోళన
టీనగర్: అన్నాడీఎంకే ప్రభుత్వ పతనం తప్పదని, అది తనంత తానుగా కూలిపోతుందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. స్టాలిన్ చెన్నై నుంచి విమానం ద్వారా తిరుచ్చికి బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.
అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నట్లు పాలకులు ఆరోపిస్తున్నారన్న విలేకరి ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ తాను అటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, వారి ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం వంటి కల్తీ వస్తువులు పెరగడంపై ప్రశ్నించగా స్టాలిన్ బదులిస్తూ రాష్ట్రంలో ఇదివరకే పాలలో కల్తీగా పేర్కొన్నారని, అయితే దాన్ని కనుగొని తగిన పరిష్కారం ఇంకా సూచించలేదని తెలిపారు.
ఒకే విమానంలో స్టాలిన్, నిర్మలా సీతారామన్: పుదుక్కోటై్టలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు ఎంకే స్టాలిన్ చెన్నై నుంచి ఆదివారం ఉదయం జెట్ ఎయిర్‌వేస్ విమానంలో తిరుచ్చి చేరుకున్నారు. అదే విమానంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఆమె పుదుక్కోట్టై, తిరుచ్చిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు.
పుదుక్కోట్టైలో డీఎంకే ఆందోళన: డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ పుదుక్కోట్టైలో ఆదివారం సాయంత్రం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పుదుక్కోట్టై చిన్నప్ప పార్కు దీనికి వేదికగా నిలిచింది. ఇందులో డీఎంకే నేతలు పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టు ఇందుకు నిదర్శనమన్నారు. ఇలావుండగా పుదుక్కోట్టైలో ఆందోళన జరిపేందుకు స్టాలిన్‌కు మదురై హైకోర్టు అనుమతి నిచ్చింది.
అంతర్జాతీయ విచారణ జరపాలి: శ్రీలంక తమిళులపై సైనికులు జరిపిన ఊచకోత గురించి స్వేచ్ఛగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరపాలని కోరారు. దీనిగురించి ఐక్యరాజ్య సమితి హక్కుల కమిషన్ అధికారి కేట్ గిల్‌మోర్‌కు రాసిన లేఖలో ఈ విధంగా ప్రస్తావించారు.