మంత్రుల వైఖరిపై గవర్నర్
= సీఎం బాగా పనిచేస్తున్నారు
= బాధ్యతలను విస్మరించిన మంత్రులు
= ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలి
= పలు వర్సిటీల్లో వీసీల నియామకంలో జాప్యం
= దీనిపై సీఎం ప్రత్యేక ద ృష్టి సారించాలి
= బెంగళూరులోనే ‘రాజీవ్’ వర్సిటీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల తీరుపై సదా విమర్శలు గుప్పిస్తున్న గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ తాజాగా వారి వైఖరిపై పెదవి విరిచారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పని తీరును ప్రశంసిస్తూనే మంత్రుల వైఖరిని తప్పుబట్టారు. నౌకా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కార్వారలోని సీ బర్డ్ నౌకాశ్రయాన్ని బుధవారం ఆయన సందర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొందరు మంత్రుల పని తీరు తనకు తృప్తినివ్వడం లేదన్నారు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం బాగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. తాను వివాదాల్లోకి పోదలచుకోలేదని, అయినప్పటికీ మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉండలేక పోతున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి నుంచి తాను సమష్టి బాధ్యతను ఆశిస్తున్నానని తెలిపారు. మొత్తం ప్రభుత్వమంతా ఒకే జట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమించాల్సి ఉందన్నారు. అయితే ఈ నియామకాల్లో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాల్సి ఉందన్నారు. రామనగర జిల్లాలో నిర్మించదలచిన రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని బెంగళూరులోనే నెలకొల్పాలని అన్నారు. బెంగళూరులో కావాల్సినంత స్థలం ఉన్నందున ఈ విశ్వ విద్యాలయం భవనాన్ని ఇక్కడే నిర్మించాలని సూచించారు. రామనగరలో ప్రైవేట్ స్థలంలో నిర్మించాల్సిన ఆగత్యం లేదన్నారు.
తీరు మారాలి
Published Thu, Dec 5 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement