
మెట్రోకు రైల్వేసిగ్నల్
నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రయాణం మరికొన్ని రోజుల్లో సాకారం కానుంది.
ఆమోదముద్ర వేసిన రైల్వే బోర్డు
మరో వారం రోజుల్లో పరుగు ప్రారంభం?
సీఎం చవాన్ ప్రారంభించే అవకాశం
టికెట్ల ధరపై ఇంకా రాని స్పష్టత
నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రయాణం మరికొన్ని రోజుల్లో సాకారం కానుంది. రైల్వే బోర్డు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మరో వారం రోజుల్లో మెట్రో సేవలు నగరవాసులకు అందుబాటుకి వస్తాయని ముంబై మహానగర ప్రాంతీయాభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) చెబుతోంది. అయితే ముహూర్తం ఎప్పుడా అన్నది ఇంకా నిర్ణయించలేదని, అది ఖరారైతే వర్సోవా- అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో ఇక పరుగులు తీయడమే ఆలస్యమంటోంది. కేంద్రానికి చెందిన రైల్వేబోర్డు సభ్యులు పరీక్షలు నిర్వహించి ఇటీవలే సేఫ్టీ సర్టీఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రైల్వేబోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేపోయింది. ఎట్టకేలకు రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెమ్మార్డీయే ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం... ఈ రైళ్లను ఎవరి చేతుల మీదుగా, ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖుల అపాయింట్‌మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. గతంలో మోనోకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దేశంలో మొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైళ్లను కేంద్ర మంత్రి ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కాని అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో చివరకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిపించాల్సి వచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రధాని, రైల్వేశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేతులమీదుగా ప్రారంభించే అవకాశముందంటున్నారు.
ప్రచారాంశంగా మారనున్న మెట్రో...
నగరవాసులకు మెట్రోసేవలను తామే అందుబాటులోకి తెచ్చామంటూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే ప్రత్యర్థి కూటమిలోని వారికి అవకాశం ఇవ్వకుండా మెట్రో క్రెడిట్‌ను పూర్తిగా తామే సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నాయి. దీంతో సీఎం చేతుల మీదుగానే మెట్రోరైలు సేవలను ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కోడ్ కూయకముందే...
మెట్రోసేవలు గత కొన్ని నెలలుగా ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయి. ఎప్పుడో పనులు పూర్తయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు రావడం, ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో అవసరమైన అనుమతులు లభించక ప్రారంభానికి నోచుకోలేదు. ఇకపై కూడా ఆలస్యం చేస్తే రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మెట్రోరైలు పరుగుకు మరోసారి అడ్డుపడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల నియమావళి అడ్డురాకముందే ఈ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు.
చార్జీలపై రాని స్పష్టత...
మెట్రో చార్జీలు ఎంత ఉంటాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కనీస చార్జీలు రూ. 9, గరిష్ట చార్జీలు రూ.13గా నిర్ణయించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఖరీదైన సేవలు ఇంత తక్కువ చార్జీలతో అందించడం సాధ్యం కాదంటూ ఎమ్మెమ్మార్డీయే నిరాకరించింది. కనీస చార్జీలు రూ.13, గరిష్ట చార్జీలు రూ.28గా నిర్ణయించాలని ఎమ్మెమ్మార్డీయే భావిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ముహూర్తం లభించగానే చార్జీలపై కూడా స్పష్టత వస్తుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్ తెలిపారు.
పెరగనున్న రియల్ ఎస్టేట్ ధరలు..
నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరిస్తుండడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం కూడా జోరందుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మెట్రో మార్గం నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని, సేవలు అందుబాటులోకి వస్తే వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.